‘ఏపీలో ప్రవహిస్తున్నది గోదావరి కాదు’

ABN , First Publish Date - 2020-02-23T06:51:31+05:30 IST

జీవనది అయిన గోదావరి కాలుష్యంతో నిండిపోయిందని సమష్టి కృషితో దీన్ని పరిరక్షించాలని వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన అవిరల్‌ నిర్మల్‌ జల్‌

‘ఏపీలో ప్రవహిస్తున్నది గోదావరి కాదు’

గోదావరి.. ఆదిలోనే అంతం..

ఇక్కడున్నది ఉపనదుల ప్రవాహమే

మూడు రాష్ట్రాల కాలుష్య వ్యర్థాలూ ఇక్కడికే

సమష్టి కృషితో గోదావరిని పరిరక్షిద్దాం

వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌

ఆయన ఆధ్వర్యంలో నాసిక్‌నుంచి అంతర్వేది వరకు నదీ పరిరక్షణ యాత్ర 

‘నన్నయ’లో ముగింపు సమావేశం


దివాన్‌చెరువు(తూర్పు గోదావరి): జీవనది అయిన గోదావరి కాలుష్యంతో నిండిపోయిందని సమష్టి కృషితో దీన్ని పరిరక్షించాలని వాటర్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన అవిరల్‌ నిర్మల్‌ జల్‌ సాక్షరతా యాత్ర ముగింపు సమావేశాన్ని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయంలో శనివారం నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలోని ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.శ్రీరమేష్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా రాజేంద్రసింగ్‌, ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు హాజరయ్యారు.


తెలంగాణలో కాలువలా మారింది

ఈ సందర్భంగా రాజేంద్రసింగ్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు మానవ భవిష్యత్‌కోసం పనిచేయాలని, నది మానవ జీవనానికి ప్రధాన భూమిక పోషిస్తుందని తెలిపారు. గౌతమ మహాముని జన్మదినోత్సవమైన ఈనెల 4న గోదావరి జన్మస్థలమైన నాసిక్‌లో ప్రారంభమైన ఈ యాత్రను ఈనెల 21న అంతర్వేదిలో ముగించానన్నారు. మహారాష్ట్ర బ్రహ్మగిరిలో గోదావరిని సిమెంట్‌ పైపుల ద్వారా మళ్లించి కాంక్రీట్‌ కట్టడాలతో బంధించి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నారన్నారు. నాసిక్‌లో పట్టణంలోని మురికిని గోదావరిలోకి మళ్లించడం ద్వారా ఆరంభంలోనే కలుషితమైందని చెప్పారు. మహారాష్ట్ర అంతటా గోదావరి నది ప్రవాహం లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, రైతులు వ్యవహరిస్తున్నారన్నారు. వీటన్నింటివల్ల గోదావరి నది ఆదిలోనే అంతమైందని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తున్నది గోదావరి ఉపనదులు తప్ప గోదావరి కాదని చెప్పారు.


వరద సమయంలో మాత్రమే పేరుకుపోయిన కాలుష్య వ్యర్థాలు గోదావరిలో ప్రవహిస్తూ వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో గోదావరి నది కాలువగా మారిపోయిందని, విపరీతంగా నీటిని తోడేయడం ద్వారా ప్రవాహం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాజమహేంద్రవరంలో ప్రవహించే గోదావరి నీరు శబరి నీరు మాత్రమేనన్నారు. తెలంగాణ నుంచి వచ్చే నీరు అతి తక్కువ శాతం ఉందని చెప్పారు.


ఖమ్మం దగ్గర కెమికల్‌ ఫ్యాక్టరీ విషపదార్థాలు, హైదరాబాద్‌  పరిసరాల్లోని మురికిని మంజీర నది ద్వారా గోదావరిలోకి విడిచి పెడుతున్నారన్నారు. ఇలా ఎగువ ప్రాంతాల్లోని అన్ని వ్యర్థ కాలుష్యాలు వరదల సమయంలో రాజమహేంద్రవరానికి చేరుతున్నాయని చెప్పారు. ఇలా గోదావరి నది ప్రవాహానికి ఆది నుంచి అడ్డంకులతో కాలుష్యంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల గోదావరి పరివాహక ప్రాంతాల వారంతా గోదావరి కుటుంబంగా ఏర్పడి నదిని కాలుష్యరహితంగా ప్రవహింపచేయాలనే ఉద్ధేశ్యంతో ఈ యాత్రను ప్రారంభించామన్నారు. గోదావరి మనందరి జీవనాడి అని, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఇలా విద్యార్థులతో నినాదాలు చేయించారు.


గోదావరి పరిరక్షణలో చొరవ తీసుకుంటాం: నన్నయ ఉపకులపతి

గోదావరి నది పరిరక్షణలో నన్నయ విశ్వవిద్యాలయం ప్రత్యేక చొరవ తీసకుంటుందని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.జగన్నాథరావు అన్నారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ శరీరంలోని ఒకచోట అనారోగ్యం వచ్చి దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది శరీరం అంతా వ్యాపించినట్టు గోదావరి నది కాలుష్యాన్ని నిర్మూలించకపోతే అది జీవ మనుగడకు ముప్పు అన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్‌ తమ యాత్రపై శ్వేతపత్రం విడుదల చేశారు. వారి బృందానికి వీసీ సన్మానం చేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జల్‌ బిందరీ జాతీయ కన్వీనర్‌ బాలిశెట్టి సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్‌ కె.రమణేశ్వరి, కె.సుబ్బారావు, డీన్‌ వై.శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T06:51:31+05:30 IST