Advertisement
Advertisement
Abn logo
Advertisement

Michigan పాఠశాలలో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులను కాల్చి చంపిన 15 ఏళ్ల బాలుడు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని మిచిగాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో 15 ఏళ్ల బాలుడు తోటి విద్యార్థులపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక ఉపాధ్యాయుడితో పాటు మరో ఆరుగురు గాయపడ్డారు. మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ అనే ప్రాంతంలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ టౌన్‌షిప్‌ హైస్కూల్‌లో మంగళవారం మధ్యాహ్నం 12:51 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఒక్లాండ్ కౌంటీ పోలీస్ అధికారి మైక్ మెక్‌కేబ్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 12:51 గంటల ప్రాంతంలో పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు ఎమర్జెన్సీ ​నెంబర్​ 911కు సుమారు 100 ఫోన్​కాల్స్ వచ్చాయని తెలిపారు. దాంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులకు తెగబడిన 15 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి కాల్పులు జరిపిన తుపాకీ, 7 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే బాలుడి తండ్రి హ్యాండ్‌గన్ కొనడం జరిగిందని, దాన్నే నిందితుడు పాఠశాలకు తీసుకొచ్చి కాల్పులకు పాల్పడ్డాడని సమాచారం. ఈ మధ్యకాలంలో పాఠశాలలో తోటి విద్యార్థులతో గొడవలు జరుగుతున్నాయని తమ కుమారుడు చెప్పినట్లు దాడికి పాల్పడిన బాలుడి తల్లిదండ్రులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అయితే, సదరు బాలుడు పాఠశాలలోకి తుపాకీని ఎలా తీసుకొచ్చాడనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఇక చనిపోయిన ముగ్గురిలో 16 ఏళ్ల బాలుడితో పాటు 14, 17ఏళ్ల ఇద్దరు బాలికలు ఉన్నారు. గాయపడిన ఏడుగురిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం పోలీసులు స్కూల్‌లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement