HYD : బిడ్డ పుట్టిందా పైసలీ.. బాబు అయితే రూ.3వేలు.. పాపకు వెయ్యి.. ప్రతి పనికో రేటు!

ABN , First Publish Date - 2021-11-26T17:37:00+05:30 IST

సర్కారు దవాఖానాల్లో చేతులు తడపనిదే ఏ పనీ కావడం లేదు. ప్రైవేట్‌లలో వేలు, లక్షల్లో కాన్పుల...

HYD : బిడ్డ పుట్టిందా పైసలీ.. బాబు అయితే రూ.3వేలు.. పాపకు వెయ్యి.. ప్రతి పనికో రేటు!

సర్కారు దవాఖానాల్లో చేతులు తడపనిదే ఏ పనీ కావడం లేదు. ప్రైవేట్‌లలో వేలు, లక్షల్లో కాన్పుల ఫీజులు చెల్లించలేక  వచ్చే వారిని ప్రసూతి ఆస్పత్రి సిబ్బంది కాసుల కోసం పట్టి పీడిస్తున్నారు. ఆస్పత్రిలో అడుగు పెట్టింది మొదలు బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చే వరకు ఏ పని కావాలన్నా పైసలియ్యాల్సిందే. 


హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులకు వచ్చే వారంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. చాలీ చాలనీ జీతాలతో బతికే వారే.  చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఆ నిరుపేదలనుంచి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు వసూలు చేయడంలో ఏ మాత్రం కనికరం చూపడం లేదు. పైసలు ఇవ్వక పోతే ఏ పని చేయడం లేదు. జంటనగరాల్లో మూడు ప్రధాన పెద్ద ప్రసూతి ఆస్పత్రు లు, మరో రెండు ఆస్పత్రుల్లో ప్రసూతి వార్డులలో వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. పేట్లబురుజు ఆస్పత్రిలోనే రోజు కు 80కి మించి డెలివరీలు ఉంటాయి. సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీలో 30 నుంచి 40, నిలోఫర్‌ ఆస్పత్రిలో 30 నుంచి 50 ప్రసవాలు ఉంటున్నాయి. గాంధీ, కింగ్‌కోఠిలోని ప్రసూతి వార్డులు 20వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో అడుగడుగునా  రేట్లను నిర్ణయించి వసూలు చేస్తారు. ఆ స్పత్రిలో సేవలు పొందేందుకు వెయ్యి రూపాయల నుంచి అయిదు వేల రూపాయల వరకు సిబ్బందికి ఏదో రూపంలో చెల్లించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు.


మంచి బెడ్‌ కావాలంటే..

 గర్భిణులకు సకాలంలో మంచి బెడ్‌ కావాలన్నా, ప్రసవ సమయంలో లేబర్‌ రూంకు తీసుకువెళ్లాలన్నా, బిడ్డ పుట్టిన తరువాత తిరిగి బెడ్‌పైకి చేర్చాలన్నా ఆయాల చేతులు తడపాల్సిందే. ఈ పనులు ఒక్కోదానికి రూ.300నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు.  


శుభ్రం చేయాలంటే చార్జీలే..

పుట్టిన బిడ్డను చక్కగా శుభ్రం చేయాలంటే మూడు వందలు ఇవ్వాల్సిందే. లేకపోతే రక్తపు మరకలను సరిగ్గా శుభ్రం చేయక అలాగే చేతిలో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో నీళ్లు లేవు.. బయటినుంచి తెచ్చేందుకు మూడు వందలు ఇవ్వాల్సిందేనని సిబ్బంది పట్టుబట్టి తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.


వార్డుకు తరలించాలంటే..

ప్రసవం తరువాత లేబర్‌ రూం నుంచి వార్డుకు మార్చాలంటే కూడా సిబ్బంది చేతిలో డబ్బులు పడాల్సిందే. లేకపోతే దురుసుగా బాలింతను, శిశువును స్ట్రెచర్‌పై వేయడం, వార్డుకు తీసుకుపోయి మంచంపై కుదేసినట్లు చేస్తారు. కొన్నిసార్లు సిబ్బంది లేరని, స్ర్టెచర్స్‌ లేవని చెబుతూ ఆలస్యం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద నుంచి రెండు వందలు ఇస్తేనే నిదానంగా వార్డుకు తరలిస్తున్నారన్నారు. 


డ్యూటీ ఆయాలకూ..

వీరందరిదీ ఒక ఎత్తయితే డ్యూటీ ఆయాలది మరో ఎత్తు. వారికీ కొంత ముట్టచెప్పాల్సిందే. వారు ఏం చేయరు కానీ వార్డులో ఉన్నందుకు కనీసం 100 నుంచి 2 వందల రూపాయలు ఇచ్చుకోవాల్సిందే. ఆస్పత్రి లోకి ప్రవేశించేందుకు సెక్యూరిటీకి ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే ప్రవేశం ఉండదు.


టీకాకు రూ.500

బిడ్డ పుట్టగానే  చూసుకోవాలని ప్రతి కుటుంబ సభ్యులకు ఆరాటం ఉంటుంది. ఈ ఆరాటాన్ని ఇక్కడి సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. బిడ్డను చూపించడానికి వెయ్యి నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. మగబిడ్డ అయితే రూ.2 నుంచి రూ.3 వేలు, ఆడ బిడ్డ అయితే వెయ్యి నుంచి రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక పిల్లలకు  వ్యాక్సినేషన్‌లో భాగంగా టీకాలు ఇప్పిందుకు రూ.500 వసూలు చేస్తున్నారు.

Updated Date - 2021-11-26T17:37:00+05:30 IST