కర్ణాటక డ్రగ్స్‌ రాకెట్‌లో ముగ్గురు టాలీవుడ్‌ ప్రముఖులు

ABN , First Publish Date - 2021-04-06T08:42:13+05:30 IST

కర్ణాటక డ్రగ్స్‌ రాకెట్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ రాకెట్‌లో ముగ్గురు తెలుగు సినీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టు బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు.

కర్ణాటక డ్రగ్స్‌ రాకెట్‌లో ముగ్గురు టాలీవుడ్‌ ప్రముఖులు

  • ఇరానీ అమ్మాయిలతో ఎంజాయ్‌ చేశాం
  • విచారణలో పోలీసులకు తెలిపిన నటుడు
  • ఎమ్మెల్యేలకు త్వరలో నోటీసులు: బెంగళూరు డీసీపీ
  • ఆధారాలుంటే ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు!
  • టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీరియస్‌.. కఠిన చర్యలు

  

‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ నెట్‌వర్క్‌

కర్ణాటక డ్రగ్స్‌ రాకెట్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ రాకెట్‌లో ముగ్గురు తెలుగు సినీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టు బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక నటుణ్ని, వ్యాపారవేత్త సందీ్‌పరెడ్డిని పోలీసులు లోతుగా ప్రశ్నించగా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. వారిచ్చిన సమాచారం మేరకు.. ఈవెంట్‌ మేనేజర్‌ కలహర్‌ రెడ్డి, పారిశ్రామికవేత్త రతన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసినా వారు హాజరు కాలేదని పోలీసులు చెబుతున్నారు.


అలాగే.. మరో ఇద్దరు టాలీవుడ్‌ నటులకు ఈ వ్యవహారంతో లింకు ఉన్నట్లు  గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడ నిర్మాత శంకర్‌ గౌడ 2019లో బెంగళూరులో ఇచ్చిన పార్టీకి హాజరు కావడమే కాకుండా అక్కడి నుంచి తిరిగి వచ్చిన సమయంలో కొకైన్‌ తీసుకుని నగరానికి వచ్చిన ఓ నేత కదలికలపై కూడా బెంగళూరు పోలీసులు నిఘా పెట్టారు. పోలీసుల విచారణలో వ్యాపార వేత్త ఇచ్చిన సమాచారం కీలక ఆయుధంగా మారిందని... అతనిచ్చిన సమాచారంతోనే పోలీసులు తీగ లాగుతున్న కొద్దీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.


అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పట్లోనే వెల్లడించలేమని బెంగళూరు ఈస్ట్‌ డీసీపీ శరణప్ప తెలిపారు. కేసు విచారణ పురోగతిలో ఉన్నట్లు మాత్రం వివరించారు. ప్రజా ప్రతినిధుల లింకుకు సంబంధించి ప్రశ్నించగా...విచారణ గోప్యంగా సాగుతోందని వివరించారు. అయితే తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని... నిందితులందరి గురించి ఇంకా పూర్తి స్పష్టత రాలేదని.. వారి జాబితా సిద్ధమైన తర్వాతనే నోటీసులు, విచారణ అంశాలపై దృష్టి సారిస్తామని వివరించారు.



అది నిజమే..

పార్టీలో ఇరానీ అమ్మాయిలతో కలసి మూడు రోజులపాటు ఎంజాయ్‌ చేసిన మాట నిజమేనని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటుడు ఇప్పటికే సీసీబీ విచారణలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలకు మరో రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేయాలని సీసీబీ పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో చిక్కుకున్న కొందరు అప్రూవర్స్‌గా మారి అందిస్తున్న కీలక సమాచారం ఆధారంగానే సినీ ప్రముఖులు, రాజకీయనేతల పేర్లు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది.


డ్రగ్స్‌ రాకెట్‌కు సంబంధించి నాలుగు కేసులు దాఖలయ్యాయని, విచారణ వేగంగా సాగుతోందని పక్కా ఆధారాలతోనే ముందుకు వెళతామని సీసీబీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. కాగా.. బెంగళూరు పోలీసులు నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాల కాపీలతో పాటు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలు కూడా సోమవారం బయటకు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది.



రాష్ట్ర పోలీసుల దర్యాప్తు..

కేసు తీవ్రత నేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విచారణలో భాగంగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల భద్రతా సిబ్బందిని శాఖాపరంగా విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేేస అవకాశం ఉంది.


ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు, వారి వెంట భద్రతా సిబ్బంది ఉన్నారా లేదా, లేకపోతే ఎక్కడికని చెప్పి వెళ్లారు, ఎప్పుడు తిరిగి వచ్చారు అనే వివరాలు ేసకరించనున్నారు. ప్రజా ప్రతినిధులు భద్రతా సిబ్బంది లేకుండా ఒంటరిగా బయటకు వెళ్తే వెంటనే వారు తమ పై అధికారులకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. మరి అప్పుడు భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారా... లేదా అనేది విచారణలో తేలనుంది.


Updated Date - 2021-04-06T08:42:13+05:30 IST