వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2021-10-17T05:12:37+05:30 IST

జిల్లాలో శుక్ర, శనివారాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. భువనగిరి మండలంలో ఒకరు, రామన్నపేట మండలంలో ఒకరు, మోటకొండూరు మండలంలో మరొకరు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే..

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
చంద్రశేఖర్‌ మృతదేహం

భువనగిరి రూరల్‌, అక్టోబరు 16: జిల్లాలో శుక్ర, శనివారాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. భువనగిరి మండలంలో ఒకరు, రామన్నపేట మండలంలో ఒకరు, మోటకొండూరు మండలంలో మరొకరు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. బైకు అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన భువనగిరి శివారులోని రాయిగిరి పరిధిలోని మాసుకుంట వద్ద జరిగింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఖాప్రా మునిసిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్‌కు చెందిన కొడిత్యాల చంద్రశేఖర్‌ (36) రాయిగిరిలో స్నేహితుడిని కలిసేందుకు బైకుపై వస్తుండగా మార్గమధ్యంలోని మాసుకుంట వద్ద బైకు అదుపు తప్పి గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి, చంద్రశేఖర్‌ కుమారుడు రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె సైదులు తెలిపారు.  


రైలు ఢీకొని ఒకరు మృతి

రామన్నపేట: రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రైలు ఢీకొని గుర్రం ముత్తయ్య (50) మృతిచెందాడు. రైలు పట్టాలు దాటుతుండగా జన్మభూమి రైలు ఢీకొనడంతో ముత్తయ్య మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ముత్తయ్యకు కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.

మోటకొండూర్‌: మండలంలోని చామకూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ రహీం (36) ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు వెళుతుండగా, అదుపు తప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య షాహిదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  


పొట్టిమర్రి వాగులో పడి యువకుడు..

రాజాపేట: రాజాపేట మండలం పొట్టిమర్రివాగులో యువకుడు గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రఘునాథపూర్‌ గ్రామానికి చెందిన కటికం సత్యనారాయణ, సిద్ధమ్మలకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదో సంతానమైన కటికం క్రాంతికుమార్‌(25) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దసరా పండుగకు స్వగ్రామానికి రాగా శనివారం మిత్రులతో కలిసి పొట్టిమర్రి ఆశ్రమం వద్దకు వెళ్లారు. సాయంత్రం మిత్రులతో కలిసి వాగులోకి దిగారు. ఈత రాకపోవడంతో చెక్‌ డ్యాం వద్ద లోతైన గుంతలు ఉండడంతో, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చెక్‌ డ్యాంకు కొంత దూరంలో మృతదేహం లభించింది. రాజాపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2021-10-17T05:12:37+05:30 IST