ముగ్గురు మహిళలు... ఒక రైలు!

ABN , First Publish Date - 2021-01-09T06:20:01+05:30 IST

రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌లో మహిళా ఉద్యోగులను చూసే ఉంటాం. లోకోపైలెట్‌గా,

ముగ్గురు మహిళలు... ఒక రైలు!

రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌లో మహిళా ఉద్యోగులను చూసే ఉంటాం. లోకోపైలెట్‌గా, గూడ్స్‌ గార్డ్‌గా ఒక్కరో ఇద్దరో తప్ప ఎక్కువ మహిళలు కనిపించరు. అలాంటిది పశ్చిమరైల్వేకు చెందిన ముగ్గురు మహిళా సిబ్బంది గూడ్స్‌ రైలును నడిపి మహిళల శక్తి సామర్ద్యాలను చాటారు. ముంబయి కేంద్రంగా ఉన్న పశ్చిమ రైల్వే అధికారులు ఈ మధ్య మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ వరకు ఒక గూడ్స్‌ బండిని తొలిసారిగా పూర్తిగా ముగ్గురు మహిళా సిబ్బందితో నడిపించి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. 


ఏ పని శక్తికి మించినది కాదు

లోకోపైలెట్‌ కుంకుమ్‌ డోంగ్రే, అసిస్టెంట్‌ లోకోపైలెట్‌ ఉదితా వర్మ, గూడ్స్‌ గార్డ్‌ ఆకాంక్ష రాయ్‌లు ఈ జనవరి 5న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మహారాష్ట్రలోని వసాయ్‌ స్టేషన్‌ నుంచి గూడ్స్‌ను బండిని గుజరాత్‌లోని వడోదర వరకు నడిపారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిపి రైలును గుజరాత్‌కు చేర్చి ఏ పని కూడా తమ శక్తికి మించినది కాదని, ఏ పనైనా తాము అదరగొట్టేలా చేయగలమని నిరూపించారు.


‘‘గూడ్స్‌ రైళ్లను నడిపేవాళ్లు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. అందుకే కొద్ది మంది మహిళలు మాత్రమే గార్డ్‌, లోకోపైలెట్‌గా చేరుతున్నారు. రైల్వేలో సవాళ్లతో కూడిన ఇలాంటి ఉద్యోగాల్లో చేరాలనుకునే మహిళలకు కుంకుమ్‌, ఉదిత, ఆకాంక్షలు స్ఫూర్తిగా నిలుస్తారు’’ అంటున్నారు ప్రజా సంబంధాల అధికారి సుమిత్‌ ఠాకూర్‌. అధికారుల ప్రయత్నాన్ని కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ మెచ్చుకోవడమే కాదు ఈ ముగ్గురు మహిళా సాధికారతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు.ఫ 


Updated Date - 2021-01-09T06:20:01+05:30 IST