మట్టి పరీక్షకు మూడేళ్లా?

ABN , First Publish Date - 2020-08-13T07:34:19+05:30 IST

రోడ్లు, భవనాల శాఖాధికారులు, కాంట్రాక్టర్ల ఆలసత్వానికి ఇది పరాకాష్ట. నెలలో పూర్తి కావాల్సిన పనులను ఏళ్లు గడుస్తున్నా చేయట్లే

మట్టి పరీక్షకు మూడేళ్లా?

 కూతలేరు బ్రిడ్జికి మోక్షమెన్నడో?

 ముందుకు కదలని పనులు


 అనంతపురం కార్పొరేషన్‌, ఆగస్టు 12: రోడ్లు, భవనాల  శాఖాధికారులు, కాంట్రాక్టర్ల ఆలసత్వానికి ఇది పరాకాష్ట. నెలలో పూర్తి కావాల్సిన పనులను ఏళ్లు గడుస్తున్నా చేయట్లేదు. నార్పలలోని కూతలేరు బ్రిడ్జి నిర్మాణం వారి పనితీరును ప్రశ్నిస్తోంది. మట్టి నమూనా పరీక్షల నివేదిక మూడేళ్లయినా రాకపోవటం వారి పనితీరుకు అద్దం పడుతోంది. ఉన్న బ్రిడ్జిని కూలదోసి, ప్రజలకు లేని అవస్థలు తెచ్చిపెట్టారు.


బ్రిడ్జి శిథిలావస్థకు చేరటంతో కూల్చి వేశారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మూడేళ్లు ముగిసినా పనులు అంగుళం కూడా ముందుకు కదలట్లేదు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు.. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయటం గమనార్హం. 2017లో టీడీపీ హయంలో టెండర్లు పిలిచారు. దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రత్యామ్నాయ రోడ్డు వేసి, చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు వస్తే ఆ రోడ్డుపై వెళ్లటానికి ప్రజలు జంకుతున్నారు. మట్టి నమూనాల పరీక్ష నివేదిక రావాలని అధికారులు చెబుతున్నారు.


దాని కోసం ఇన్నేళ్లు పట్టడం ఏంటని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో ముగ్గురు, నలుగురు డీఈలు మారారంటే ఆ పని ఎంత ఆలస్యమైందో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు గుడ్‌ విల్‌ కోసం ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన మంత్రి శంకర్‌నారాయణకు ఇటీవలే రోడ్లు, భవనాల శాఖ అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలోనైనా బ్రిడ్జి పనులు ముందుకు కదులుతాయో, లేదో.. వేచిచూడాల్సిందే.


ఆలస్యంలో ఆంతర్యమేంటి?

కూతలేరు బ్రిడ్జి పనులు ప్రారంభం కాకపోవటానికి ఆంతర్యమేంటో అంతు చిక్కట్లేదు. 2016లో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మరుసటి ఏడాదే టెండర్లు పిలిచారు. అనుకున్నదే తడువుగా బ్రిడ్జిని కూలదోశారు. కొత్త బ్రిడ్జి పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఏడాదిన్నర తరువాత ప్రత్యామ్నాయ రహదారి వేశారు. కొనసాగుతుండగానే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.


25 శాతం పూర్తికాని, మొదలు కాని పనులను రద్దు చేసింది. దీంతో కొంతకాలం బ్రిడ్జి పనులు నిలచిపోయాయి. ప్రత్యేక సిఫార్సు కింద బ్రిడ్జి పనులు ప్రారంభించేలా అనుమతి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మరోసారి శంకుస్థాపన చేశారు. అక్కడ బ్రిడ్జి కూల్చిన తరువాత కనిపించిన గుంత మాత్రమే నేటికీ వెక్కిరిస్తోంది. కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదిరాక మట్టి నమూనా పరీక్షలు చేపడతారు. చౌడు, నల్లరేగడి, ఇసుక లాంటి లూజు మట్టి ఎంతవరకు ఉందో పరిశీలిస్తారు. ఆ తరువాతే బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్‌ ఇస్తారు. మట్టి పరీక్ష నివేదిక రావటానికి 14 నుంచి 28 రోజులు పడుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి.


కూతలేరు బ్రిడ్జి విషయంలో మాత్రం మూడేళ్లు దాటినా మట్టి పరీక్ష ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారంటే ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు, అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ రిపొర్ట్‌ కూడా కాంట్రాక్టరే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఆ కాంట్రాక్టర్‌ ఈ విషయంలో ఎందుకు విఫలమవుతున్నారో తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు కూడా దృష్టి సారించట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మట్టి పరీక్షల నివేదిక కోసం ప్రయత్నిస్తున్నాం: ప్రసాద్‌రెడ్డి, డీఈ, ఆర్‌అండ్‌బీ

గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వచ్చి ఏడాదయ్యింది. సాయిల్‌ టెస్టు కోసం పంపాం. నివేదిక వచ్చిన తరువాతే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. గుడ్‌విల్‌ కోసం ప్రయత్నిస్తున్నారనేది నా దృష్టికి రాలేదు.

Updated Date - 2020-08-13T07:34:19+05:30 IST