‘భాయ్‌’ పేరిట బెదిరింపులు.. అమ్మాయి ఫొటోతో వల.. రాజకీయ నాయకులే టార్గెట్‌!

ABN , First Publish Date - 2021-07-04T14:37:19+05:30 IST

ముగ్గురు యువకులు భాయ్‌ అంటూ ఓ రాజకీయ నాయకుడికి ఫోన్‌ చేసి...

‘భాయ్‌’ పేరిట బెదిరింపులు.. అమ్మాయి ఫొటోతో వల.. రాజకీయ నాయకులే టార్గెట్‌!

హైదరాబాద్‌ సిటీ : ముగ్గురు యువకులు భాయ్‌ అంటూ ఓ రాజకీయ నాయకుడికి ఫోన్‌ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని, లేకపోతే హతమారుస్తామని బెదిరించారు. మరొకరికి అందమైన అమ్మాయి ఫొటోతో ఎరవేసి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు కటకటాల పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహే్‌షభగవత్‌ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండలం మార్టూర్‌ గ్రామానికి చెందిన సందేపల్లి క్రాంతికుమార్‌(23) ఉప్పల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ సమీపంలో యాడ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతడి తమ్ముడు సందేపల్లి సింహాద్రి(19) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి స్నేహితుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సోమరాజిగూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి సంగి జశ్వంత్‌(20) ఉప్పల్‌లో ఇతడివద్దే ఉండి చదువుకుంటూ యాడ్‌ ఏజెన్సీ పనుల్లో సహకరిస్తున్నారు. యాడ్‌ ఏజెన్సీ పనుల్లో భాగంగా భువనగిరి ప్రాంతంలో ఉండే రాజకీయనాయకులతో క్రాంతి కుమార్‌కు పరిచయాలున్నాయి. డిగ్రీ చదువుతున్న సింహాద్రి ఫుడ్‌ డెలివరీ యాప్‌ల మాదిరిగా నీరు సరఫరా చేసేందుకు యాప్‌ రూపొందించాలని భావించాడు. దానికి అవసరమైన పెట్టుబడి కోసం భువనగిరి ప్రాంత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, ఓ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడైన బీర్ల ఐలయ్యను సంప్రదించి తాము రూపొందించబోయే యాప్‌కు పెట్టుబడి సమకూర్చాలని కోరారు. కానీ ఐలయ్య డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బుల విషయమై వారు భువనగిరి ప్రాంతంలో ప్రముఖులను, రాజకీయ నాయకులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. మంచితనంతో పనికాకుంటే బెదిరించైనా డబ్బు రాబట్టాలని ముగ్గురు పథకం వేశారు.


పోలీసులకు చిక్కకుండా..

ఫోన్‌ చేసి బెదిరిస్తే నెంబర్‌ ద్వారా తమను పోలీసులు గుర్తిస్తారని, తార్నాక ప్రాంతంలో ఉంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీధివ్యాపారి తిలక్‌సింగ్‌ ఫోన్‌ ను దొంగిలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు చంచలగూడ ప్రాంతంలో రెండు కత్తులు కొన్నారు. ఆన్‌లైన్‌లో డాగర్‌ ఆర్డర్‌చేసి తెప్పించుకున్నా రు. అన్నీ సిద్ధం చేసుకొని బెదిరింపులు ప్రారంభించారు. తెలుగులో మాట్లాడితే అనుమానం వస్తుందని హిందీలో బీహారీ యాస మాట్లాడే ప్రయత్నం చేశారు.


గ్యాంగ్‌స్టర్‌ ఖలీల్‌ పేరుతో..

పథకంలో భాగంగా చోరీ చేసిన ఫోన్‌తో జూన్‌ 26, 27 తేదీల్లో ఐలయ్యకు ఫోన్‌ చేశారు. తాము గ్యాంగ్‌స్టర్‌ ఖలీల్‌ తరఫున మాట్లాడుతున్నామని.. రూ. 5 కోట్లు ఇవ్వకుంటే.. హతమారుస్తామని బెదిరించారు. ‘నీ గురించి మాకు పూర్తిగా తెలుసు.. నీ పరువు తీస్తాం’అని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడని ఐలయ్య భువనగిరి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ప్రయత్నం వదిలేసి, ఫోన్‌ లొకేషన్‌ దొరకకుండా ఉండేందుకు వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని సిమ్‌ తీసేశారు.


అమ్మాయి ఫొటోతో ఎర..

రెండో పథకంలో భాగంగా ఆన్‌లైన్‌లో అందమైన అమ్మాయి ఫొటో డౌన్‌లోడ్‌ చేశారు. వాట్సాప్‌ డీపీలో ఆ ఫొటోను పెట్టి మరో రాజకీయనాయకుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గోరేటి శ్రీనివా్‌సకు తనపేరు వసుమతి అని ఖమ్మంలో ఉంటానని మెసేజ్‌లు చేశారు. శ్రీనివాస్‌ కూడా ఆమెకు మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. కొద్దిరోజులపాటు మెసేజ్‌ల అనంతం అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించారు. దీనికి స్పందించిన శ్రీనివాస్‌ కూడా ఆదే రకమైన మెసేజ్‌లు పంపేవాడు. జూన్‌ 29న శ్రీనివా్‌సకు ఫోన్‌ చేసిన క్రాంతి కుమార్‌ ‘నేను వసుమతి భర్తను.. మీ ఇద్దరి మధ్య జరిగిన అసభ్య సంభాషణలు నా వద్ద ఉన్నాయి, రూ.10 లక్షలు ఇవ్వు, లేకపోతే మీ ఇద్దరి వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా క్రిమినల్‌ కేసు పెడతాను’ అని బెదిరించాడు.


మళ్లీ జూన్‌ 30న కూడా క్రిమినల్‌ కేసుల పేరుతో భయపెట్టి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించాడు. ఈ బెదిరింపులకు లొంగని శ్రీనివాస్‌ ఆలేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసుల దర్యాప్తులో భాగంగా ఎస్‌ఓటీ డీసీపీ సురేందర్‌రెడ్డి సాంకేతిక ఆధారాలు సేకరించారు. పలు కోణాల్లో విచారణ జరిపి నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి హోండా యాక్టివా, 3 కత్తులు, చోరీ చేసిన ఫోన్‌, ముగ్గురు నిందితులకు చెందిన మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-07-04T14:37:19+05:30 IST