Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనుమానాస్పద స్థితిలో మూడేళ్ల చిన్నారి మృతి

 తండ్రిపైనే అనుమానాలు.. టేక్మాల్‌ మండలం పల్వంచలో ఘటన  
టేక్మాల్‌, నవంబరు 30: అన్నెం పున్నెం ఎరగని చిన్నారి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. తనకు పుట్టిన బిడ్డ కాదంటూ తండ్రే ఆమెను హత్య చేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన టేక్మాల్‌ మండలంలోని పల్వంచ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్వంచ గ్రామానికి చెందిన బూర్ల రమణయ్య, సావిత్రికి 2014లో వివాహం జరిగింది. అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. అనంతరం సావిత్రి ఆందోల్‌ మండలానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకోగా, వారికి కూతురు వర్షిణి జన్మించింది.  8 నెలల క్రితం సావిత్రి మళ్లీ రెండో భర్తకు విడాకులిచ్చి, మొదటి భర్త రమణయ్య వద్దకు వచ్చేసింది.  భార్య సావిత్రి గర్భం ధరించడంతో వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం టేక్మాల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వారితో పాటు వర్షిణి(3)ని కూడా తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు ముగించుకొన్న తర్వాత రమణ్య తన భార్య సావిత్రిని ఇతరుల వాహనంపై లిఫ్ట్‌ అడిగి ఇంటికి పంపాడు. అనంతరం రమణయ్య కూతురు వర్షిణితో కలిసి కాలినడకన ఇంటికి బయలుదేరారు. అపస్మారకస్థితిలో ఉన్న వర్షిణిని ఎత్తుకుని ఇంటికి చేరుకున్న భర్త రమణయ్యను చూసి ఏమైందని ప్రశ్నించగా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైనట్టు చెప్పాడు. కాగా చుట్టుపక్కలవారు వచ్చి పరిశీలించగా మృతి చెందిన వర్షిణి గొంతుపై గాయాలు కనిపించాయి. దీంతో తండ్రి రమణయ్యే వర్షిణి తనకు పుట్టలేదని గొంతు నులిమి హత్య చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారమందుకున్న అల్లాదుర్గం సీఐ జార్జ్‌, టేక్మాల్‌ ట్రెయినీ ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.   

Advertisement
Advertisement