సంతానం లేని వారికి అమ్మేందుకు మూడేళ్ల బాలిక కిడ్నాప్‌

ABN , First Publish Date - 2020-10-22T07:51:05+05:30 IST

అపహరణకు గురైన మూడేళ్ల బాలిక కథ సుఖాంతమైంది. రెండు రోజుల తర్వాత చిన్నారి తల్లి ఒడికి చేరింది. బస్టాండ్ల

సంతానం లేని వారికి అమ్మేందుకు మూడేళ్ల బాలిక కిడ్నాప్‌

రూ.2 లక్షలకు ఒప్పందం 

తల్లిని ఏమార్చి చిన్నారి అపహరణ 

అప్పగిస్తుండగా పట్టుబడ్డ నిందితులు

కన్నతల్లి ఒడికి బాలిక.. 

 ఐదుగురు అరెస్టు, పరారీలో ఒకరు 


యాదాద్రి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అపహరణకు గురైన మూడేళ్ల బాలిక కథ సుఖాంతమైంది. రెండు రోజుల తర్వాత చిన్నారి తల్లి ఒడికి చేరింది. బస్టాండ్ల వద్ద నిరుపేద మహిళలను ఏమార్చి, లేదంటే మురికివాడల్లో పిల్లలను అపహరించి వారిని అమ్మి సొమ్ము చేసుకోవాలకున్నవారి పన్నాగం విఫలమైంది. యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన ఉప్పోతల రాము  జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అతడిని వెదుక్కుంటూ భార్య మహేశ్వరి  మూడేళ్ల కుమార్తెతో నగరానికి పయనమైంది.


   19వ తేదీన ఎంజీబీఎ్‌సకు వచ్చింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లా తాటికొండకు చెందిన మొరపాక బాబు, అతడి అన్న, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఉండే రాజు కంటపడింది. రూ.2 లక్షలకు ఎవరైనా చిన్నారిని తీసుకొచ్చి ఇచ్చేలా వీరు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండేలగూడానికి చెందిన లకావత్‌ భిక్షపతితో అతడి బావమరిది జాటోతు బాలు ద్వారా ఒప్పందం చేసుకున్నారు. భిక్షపతికి పెళ్లయి 20 ఏళ్లయినా పిల్లలు లేరు. కాగా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం గాలిగుట్టతండాకు చెందిన   బాలు.. లావుడ్య శ్రీనుకు విషయం చెప్పాడు.  ్ఞఅతడు స్నేహితుడైన బాబుకు విషయం తెలిపాడు. దీంతో బాబు అన్న రాజు, వదిన అండమ్మ కలిసి కిడ్నాప్‌ ఆలోచన చేశారు.


19న బాబు, రాజుకు ఎంజీబీఎ్‌సలో మహేశ్వరి  కనిపించింది. ‘నీ భర్త రాము తెలుసు’ అంటూ  ఆమెను భువనగిరి తీసుకెళ్లారు.  బస్టాండ్‌లో అప్పటికే వేచి చూస్తున్న అండమ్మ... బాలిక టాయిలెట్‌కు వెళతానంటోందని తీసుకెళ్లింది. తర్వాత ముగ్గురూ కనిపించలేదు.  మహేశ్వరి,  భువనగిరి పోలీసులకు పిర్యాదు చేసింది.  బస్టాండ్‌లో సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. బాబు, రాజు, అండమ్మ.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం కరుణాపురం చర్చి వద్ద భిక్షపతి, బాలు, శ్రీనును కలిశారు. భువనగిరిలో పూజల అనంతరం బాలికను అప్పగిస్తుండగా రాజు, అండమ్మతో పాటు శ్రీను, జాటోతు బాలు, భిక్షపతిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు బాబు పరారీలో ఉన్నాడు. మహేశ్వరి ఆమె కుమార్తెను భువనగిరిలోని సఖి కేంద్రానికి తరలించారు.


Updated Date - 2020-10-22T07:51:05+05:30 IST