Advertisement
Advertisement
Abn logo
Advertisement

గొంతు నొక్కే కేసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యల ఘనత సుప్రీంకోర్టులో కూడా మోగిపోతోంది. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను, ప్రసంగాలను ప్రసారం చేసినందుకు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 వార్తాచానెళ్లపై రాజద్రోహం అభియోగాలు మోపడం మీడియా గొంతు నొక్కడమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రఘురామరాజుపై పెట్టిన కుట్రకేసులో తమను కూడా చేరుస్తూ, రాజద్రోహ నేరాన్ని మోపుతూ ప్రాథమిక నివేదిక రూపొందించడాన్ని సవాల్ చేస్తూ రెండు తెలుగు వార్తాచానెళ్లు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. కేంద్రప్రభుత్వంలోని, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేస్తూ, నాలుగువారాలలోపు సమాధానం చెప్పాలని, ఆ లోపు ఎబిఎన్, టీవీ5 చానెళ్లపై ఎటువంటి దౌర్జన్యపూరిత చర్యకూ పాల్పడవద్దని న్యాయమూర్తులు ఆదేశించారు. ఒక రాజకీయ నాయకుడి వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు ప్రసారసాధనాలపై రాజద్రోహ నేరాన్ని మోపడం న్యాయస్థానానికి ఎంతగా నిరసన పూర్వక ఆశ్చర్యాన్ని కలిగించిందంటే, మొత్తంగా నేరశిక్షాస్మృతిలో రాజద్రోహాన్ని నిర్వచించే 124 ఎ మీదనే సమీక్ష అవసరమన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ఈ వ్యాజ్యం అంతిమంగా ‘రాజద్రోహం’ మీదనే కీలకమైన న్యాయ నిర్ణయానికి దారితీయవచ్చునన్న సూచన కనిపిస్తున్నది. 


కొవిడ్ సంబంధిత సమాచారాన్ని ప్రసారం చేసినా, ప్రచురించినా సమాచార సాధనాలపై ఎటువంటి కేసులు పెట్టరాదని సుప్రీంకోర్టు ఏప్రిల్ 30వ తేదీన ఒక కేసులో ఆదేశించింది. అందుకు విరుద్ధంగా రఘురామకృష్ణంరాజు కేసులో తమపై కేసులు పెట్టడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టేనని వార్తాచానెళ్లు రాజ్యాంగంలోని 32వ అధికరణం కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి మీడియాపై ఒత్తిడి తెచ్చి భయపెట్టడమేనని, వాక్‌స్వాతంత్ర్యాన్ని భంగపరచడమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఘాయిత్యపు ధోరణిని గమనించిన న్యాయస్థానం, ఇటీవల అనేక రాష్ట్రాలలోను, ఇతరత్రాను రాజద్రోహ కేసులను తరచుగా మోపుతున్న సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకుని, సమీక్ష చేయాలన్న బలమైన సూచన చేసి ఉండవచ్చు. నెలరోజుల కిందటే, సుప్రీంకోర్టులో రాజద్రోహచట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు అయింది. దాన్ని దాఖలు చేసినవారు కూడా పాత్రికేయులే. మణిపూర్‌కు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు పాత్రికేయులు, తాము రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలపై విమర్శనాత్మక పోస్టులను సామాజిక మాధ్యమాలలో ప్రచురించినందుకు, వ్యంగ్య చిత్రాలను పంచుకున్నందుకు తమ మీద రాజద్రోహం కేసులు పెట్టారని, ఆ కేసులు పెట్టడానికి వీలు కల్పిస్తున్న నేరశిక్షాస్మృతి 124 ఎ సెక్షన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ, సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గత కొద్ది సంవత్సరాలుగా రాజద్రోహం కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఏర్పడడానికి కారణం, అనేకమంది ప్రభుత్వ విమర్శకులు ఆ కేసుల బారిన పడడమే. సుమారు మూడు నెలల కిందట, రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరిగి, మరో అభ్యర్థన ప్రభుత్వ పక్షంపై తీవ్ర ఆరోపణలతో వచ్చినప్పుడు దాని విచారణకు అంగీకరించింది. 


రాజద్రోహం కేసు మాత్రమే కాదు, చట్టవ్యతిరేక కార్యక్రమాల చట్టం ‘ఊపా’ను కూడా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కూడా ఉపయోగించుకుంటున్నాయి. పౌరసత్వ వ్యతిరేక చట్టంపై ఉద్యమించినవారిని, రైతాంగ ఉద్యమంలో పాల్గొంటున్నవారిని ‘ఊపా’ కింద అరెస్టులు చేశారు. చివరకు, ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన హథ్రాస్‌ను సందర్శించడానికి వెళ్లిన పాత్రికేయునిపై ఆ చట్టం పెట్టారు. ‘ఊపా’ కేసు మోపినవారిపై తరచు రాజద్రోహం కేసు కూడా అదనంగా మోపుతారు. తాజాగా, బాధిత పాలస్తీనా ప్రజలకు మద్దతు ప్రకటించమని సామాజిక మాధ్యమంలో కోరినందుకు ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అరెస్టు చేశారు. మిలిటెంట్లతో ఘర్షణలో మరణించిన పోలీసు అధికారులను అమరవీరులని పిలవడం మీద భిన్నాభిప్రాయం ప్రకటించిన ఒక అస్సామీ రచయిత్రిని రాజద్రోహం నేరంపై అరెస్టు చేశారు. సైనిక, అర్ధసైనిక వ్యవహారాలలో అమరవీరులన్న హోదా ఏదీ లేదని స్వయంగా భద్రతాయంత్రాంగమే ఈ మధ్య స్పష్టం చేసింది. 


బ్రిటిష్ సామ్రాజ్యవాదుల హయాంలో, వారు రూపొందించిన రాజద్రోహ చట్టం ఇంకా ఇంతకాలం అట్లాగే కొనసాగడం ఒక ఆశ్చర్యం అయితే, ఒకప్పుడు తీవ్రమయిన పరిష్కారాలను, మిలిటెంట్ రాజకీయాలను ఆచరించేవారిపై ఇటువంటి కేసులు పెట్టే పోలీసు యంత్రాంగాలు, ఇప్పుడు సాధారణ రాజకీయ ప్రత్యర్థుల మీద, మీడియా మీద కూడా ఈ నేరాలు మోపడం ఇంకా విడ్డూరం. శిక్ష పడటం, పడకపోవడంతో నిమిత్తం లేకుండా, రాజద్రోహం, ఊపా వంటి చట్టాలలోని కఠినమైన నిబంధనల కారణంగా విచారణ కాలంలో బెయిల్ దొరకకుండా వేధించడానికి, దీర్ఘకాలం నిర్బంధించడానికి అనువుగా ఉంటుందన్న ధోరణిలో ప్రాసిక్యూషన్ వ్యవహరిస్తూ ఉండడం విచారకరం. రాజద్రోహం సెక్షన్‌తో మొదలుకుని న్యాయవ్యవస్థ మొదలుపెట్టే ఈ సమీక్ష, అన్ని అప్రజాస్వామిక చట్టాల వరకు విస్తరిస్తుందని ఆశించాలి. న్యాయవ్యవస్థలో కనిపిస్తున్న కొత్త చైతన్యం ఆ ఆశకు ఆస్కారం ఇస్తున్నది.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...