పుష్కరాలకు.. ప్రయాణమెలా?

ABN , First Publish Date - 2020-11-19T05:27:50+05:30 IST

పన్నెండు ఏళ్లకు ఒకసారి వచ్చే తుంగభద్ర నది పుష్కరాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా జిల్లాలోని భక్తులు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొన్నది.

పుష్కరాలకు.. ప్రయాణమెలా?
స్నానం చేస్తున్న భక్తులు

రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు

అందుబాటులో లేని రవాణా సౌకర్యాలు 

కర్నూలుకు ఒక రైలుని నడపాలని జిల్లా భక్తుల విజ్ఞప్తి


గుంటూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పన్నెండు ఏళ్లకు ఒకసారి వచ్చే తుంగభద్ర నది పుష్కరాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుండగా జిల్లాలోని భక్తులు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 20వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండగా ఇప్పటివరకు కర్నూలు వైపునకు ఒక్క రైలుని కూడా రైల్వే శాఖ ప్రకటించలేదు. ప్రస్తుతం గుంతకల్లు మార్గంలో ప్రశాంతి, అమరావతి ఎక్స్‌ప్రెస్‌లు నిత్యం రాకపోకలు సాగిస్తోన్నప్పటికీ వాటి ద్వారా నంద్యాల వరకే చేరుకోగలరు. అక్కడి నుంచి తుంగభద్ర నదికి చేరుకోవాలంటే ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో కరోనా లాక్‌డౌన్‌కు ముందు నడిచిన గుంటూరు - కాచిగూడ వయా కర్నూలు టౌన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని పునరుద్ధరించాలని జిల్లాలోని భక్తులు కోరుతున్నారు.  

తుంగభద్ర నది పుష్కరాలు శుక్రవారం నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. మన రాష్ట్రంలో ప్రవహించే పుణ్యనదుల్లో గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర నది పుష్కరాలకు వెళ్లేందుకు చాలామంది ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పటికీ రైలు సౌకర్యం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అరకొరగా బస్సు సర్వీసులు ఉన్నప్పటికీ వాటి ద్వారా ఎంతో వ్యయంతో కూడుకున్నది. ఇక ప్రైవేటు కార్ల ద్వారా అయితే వెళ్లి రావడానికి రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో  కొద్ది రోజుల నుంచి అంతా గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలు పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే పుష్కరాల తేదీ మరో రోజులోకి వచ్చినప్పటికీ రైల్వే శాఖ నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు జారీ కాక పోవడంతో నిరుత్సాహానికి గురౌతున్నారు. 

ప్రశాంతి, అమరావతి ఎక్స్‌ప్రెస్‌లు నంద్యాల, గుంతకల్లు స్టేషన్ల మీదగా వెళతాయి. అయితే అక్కడ దిగి తుంగభద్ర నదికి చేరుకోవాలంటే మరో 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే కర్నూలు టౌన్‌కి రైలు వెళితే అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరం లోపే తుంగభద్ర నదికి చేరుకుని పుష్కర స్నానం ఆచరించ వచ్చని భక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం పుష్కరాలు జరిగే రోజుల వరకు అయితే ఒక రైలుని గుంటూరు నుంచి కర్నూలు టౌన్‌కి నడపాలని ప్రజలు రైల్వేని కోరుతున్నారు. గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాలు జరిగినప్పుడు పదుల సంఖ్యలో ప్రత్యేక రైళ్లని కూడా గుంటూరు మీదగా నడిపారు. ఇప్పుడు కనీసం ఒక్క రైలు అయినా నడుపుతామన్న ప్రకటన రైల్వే నుంచి రావడం లేదు. కాగా గుంటూరు రైల్వేస్టేషనలో ఒక రేక్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ రైల్వేబోర్డు నుంచి అనుమతి రాకపోవడంతో దానిని నడపలేని పరిస్థితి నెలకొన్నది. 


Updated Date - 2020-11-19T05:27:50+05:30 IST