ఇలా తల్లీ బిడ్డా క్షేమం

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

కరోనా గురించి భయాలు గర్భిణులకు ఎక్కువ. వ్యాక్సిన్‌ వేయించుకోవాలా, ప్రసవం వరకూ ఆగాలా? కృత్రిమ

ఇలా తల్లీ బిడ్డా క్షేమం

కరోనా గురించి భయాలు గర్భిణులకు ఎక్కువ. వ్యాక్సిన్‌ వేయించుకోవాలా, ప్రసవం వరకూ ఆగాలా? కృత్రిమ గర్భధారణ సురక్షితమేనా?... ఇలాంటి లెక్కలేనన్ని అనుమానాలు, అయోమయాలూ గర్భిణులను వేధిస్తూ ఉంటాయి. అయితే గర్భిణులు కరోనా గండాన్ని తేలికగా గట్టెక్కే వీలుంది అంటున్నారు గైనకాలజిస్టులు!


గర్భిణులకు కరోనా సోకడం ప్రమాదకరం అనేది అపోహ. కరోనా సోకినంత మాత్రాన భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదు. మిగతా వారికి అనుసరించే చికిత్సా విధానమే గర్భిణులకూ వర్తిస్తుంది. కరోనా సోకిన గర్భిణుల్లో 80ు మందిలో లక్షణాలు కనిపించవు. కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినా వీరిలో లక్షణాలు బయల్పడవు. మిగతా 20ు మందిలో మోడరేట్‌, సివియర్‌ పరిస్థితి ఉండే వీలుంది. కేవలం 5ు మంది గర్భిణులే అత్యంత తీవ్రమైన క్రిటికల్‌ దశకు చేరుకుంటూ ఉంటారు. అయితే కొవిడ్‌ సోకిన గర్భిణుల విషయంలో వారి జెస్టేషనల్‌ పీరియడ్‌ను పరిగణలోకి తీసుకుని చికిత్స కొనసాగించవలసి ఉంటుంది. 


ఫస్ట్‌ ట్రైమెస్టర్‌: మొదటి మూడు నెలల (ఫస్ట్‌ ట్రైమెస్టర్‌)లో లక్షణాలు బయల్పడని కొవిడ్‌ గర్భిణులకు ప్రత్యేక కొవిడ్‌ చికిత్స అవసరం ఉండదు. 14 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుంది. ఒకవేళ దగ్గు, జ్వరం లాంటివి మొదలైతే పారాసిటమాల్‌, దగ్గు మందులు తీసుకోవచ్చు. అయితే లక్షణాలు మరింత ముదిరి జ్వరం తగ్గకుండా పెరుగుతూ, ఆయాసం, కీళ్లనొప్పులు లాంటివి మొదలైతే లక్షణాల తీవ్రతను బట్టి, దశను అంచనా వేసి, అందుకు తగిన చికిత్స అందించవలసి ఉంటుంది. 


సెకండ్‌ ట్రైమెస్టర్‌: ఈ దశలో కూడా లక్షణాలు స్వల్పంగా ఉంటే కంగారు పడవలసిన అవసరం లేదు. కేవలం లక్షణాలు తీవ్రమై మోడరేట్‌గా మారినప్పుడు మాత్రమే కొవిడ్‌ చికిత్స అవసరం పడుతుంది. కొవిడ్‌ చికిత్సలో మధ్యస్తం (మోడరేట్‌) అనేది కీలక దశ. ఆరోగ్య పరిస్థితి ఈ దశ నుంచి దిగువకు దిగి రావచ్చు, మరింత తీవ్రమై సివియర్‌ దశకూ ఎదగవచ్చు. కాబట్టి ఈ దశలో ఉన్న గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ, చికిత్స అందించవలసి ఉంటుంది. మోడరేట్‌ దశకు చేరుకున్న వాళ్లు ఆస్పత్రిలో చేరవలసి రావచ్చు. సివియర్‌ లేదా క్రిటికల్‌ దశకు చేరుకున్నవాళ్లకు ఐసియు అడ్మిషన్‌ అవసరం అవుతుంది.


థర్డ్‌ ట్రైమెస్టర్‌: మొదటి ట్రైమెస్టర్‌తో పోలిస్తే, చివరిదైన థర్డ్‌ ట్రైమెస్టర్‌ గర్భిణులకు రిస్క్‌ ఎక్కువ. వీరిలో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో గమనించుకోవాలి. బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) ఎక్కువగా ఉన్నా, మధుమేహం, గర్భధారణతో తలెత్తే జెస్టేషనల్‌ డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, అనీమియా మొదలైన ఆరోగ్య సమస్యలు కలిగిన గర్భిణుల్లో కొవిడ్‌ ఇన్‌ఫెక్ఫన్‌ తీవ్రమై, లక్షణాలు కూడా తీవ్రరూపం దాలుస్తాయి. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లను ఐసియులో ఉంచి చికిత్స అందించవలసి ఉంటుంది. 


మధుమేహం ఉన్న గర్భిణులు

ముందు నుంచీ మధుమేహం కలిగి ఉండి, గర్భం దాల్చిన వాళ్లు ఉంటారు. గర్భం దాల్చిన తర్వాత మధుమేహం తలెత్తిన వారూ (జెస్టేషనల్‌ డయాబెటిస్‌) ఉంటారు. ముందు నుంచీ మఽధుమేహం కలిగి ఉన్న మహిళలు, మందులతో షుగర్‌ను అదుపులోకి తెచ్చుకుని, ఆ తర్వాతే గర్భధారణను ప్లాన్‌ చేసుకోవాలి. కొన్ని రిస్క్‌ ఫ్యాక్టర్ల ఆధారంగా కొందరు మహిళలకు గర్భం దాల్చిన తర్వాత మధుమేహం మొదలవుతుంది. ఏదైమైన్నప్పటికీ మధుమేహం అనేది కొమార్బిడ్‌ స్థితి కాబట్టి, ఇన్‌ఫెక్ఫన్‌ సోకే అవకాశాలూ, సోకిన ఇన్‌ఫెక్షన్లు తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీళ్లకు రిస్క్‌లూ ఎక్కువే. పైగా మధుమేహం కలిగిన గర్భిణులు ఊబకాయులుగా ఉంటారు. కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు ఇవ్వడం, వాటి మూలంగా రక్తంలో చక్కెర మోతాదులు అదుపు తప్పడం సహజం. కాబట్టి చికిత్స సమయంలో ఇచ్చే స్టిరాయిడ్లు, పెరుగుతున్న చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ, పెరిగే చక్కెరకు తగ్గట్టు ఇన్సులిన్‌ మోతాదును పెంచుకుంటూ, కొవిడ్‌ చికిత్స కొనసాగించవలసి ఉంటుంది. 



కొవిడ్‌ వాతావరణంలో కృత్రిమ గర్భధారణ?

గర్భధారణకు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కూ సంబంధం లేదు. కొవిడ్‌ కాలం కొనసాగుతున్నంత మాత్రాన గర్భధారణను వాయిదా వేసుకోవలసిన అవసరం లేదు. కొవిడ్‌ పాండమిక్‌ గురించి, వ్యాక్సిన్‌ గురించి గర్భధారణను వాయిదా వేసుకోవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ సమయంలో గర్భం దాల్చినా, దాల్చకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గర్భధారణకూ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడానికీ సంబంధం లేదు కాబట్టే కృత్రిమ గర్భధారణ విధానాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే వ్యాక్సిన్‌ తీసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు వారాల తర్వాతే కృత్రిమ గర్భధారణ విధానాలను ప్రయత్నించాలి. అండాల సేకరణ, పిండాన్ని గర్భంలో ప్రవేశపెట్టడం మొదలైన విధానాలను మహిళలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు వారాల తర్వాతే చేయడం జరుగుతోంది.


వ్యాక్సిన్‌తో తలెత్తే జ్వరం, కీళ్లనొప్పులు మొదలైన దుష్ప్రభావాలతో కృత్రిమ గర్భధారణను వాయిదా వేసుకోవలసి వస్తే, ఐవిఎఫ్‌ క్యాన్సిలేషన్‌ ఖర్చులు పెరగడం, వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ఐవిఎఫ్‌ ద్వారా దాల్చిన గర్భంలో ఏవైనా సమస్యలు తలెత్తితే, వాటిని వ్యాక్సిన్‌తో ముడిపెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టే వ్యాక్సిన్‌కూ కృత్రిమ గర్భధారణకూ మధ్య రెండు వారాల వ్యవధిని నిర్ణయించడం జరిగింది. అలాగే ఐవిఎఫ్‌ ద్వారా గర్భం దాల్చిన తర్వాత, సాధారణ గర్భిణుల మాదిరిగానే వీళ్లు కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. 


వెంటిలేటర్‌ మీదకు వెళ్లిన గర్భిణులు

వెంటిలేటర్‌ దశకు చేరుకున్న నిండు గర్భిణులది ఎంతో క్లిష్ట పరిస్థితి. అయినప్పటికీ నెల రోజుల పాటు వెంటిలేటర్‌ చికిత్స తీసుకుని, పూర్తిగా కోలుకుని బిడ్డతో పాటు ఇంటికి చేరుకున్న గర్భిణులు ఉన్నారు. వెంటిలేటర్‌ మీద ఉన్న తల్లి ఆరోగ్య పరిస్థితి, కడుపులో పెరుగుతున్న బిడ్డ వయసు ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కడుపులో పెరుగుతున్న బిడ్డ వయసు 26, 27 వారాలు దాటినప్పుడు ప్రసవం చేయవచ్చు. ఈమాత్రం గర్భస్థ వ్యవధితో ప్రసవం చేస్తే, బిడ్డ బ్రతికే అవకాశాలు ఎక్కువే!


కాబట్టి తల్లికి సోకిన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ దశను బట్టి, ప్రసవం చేయడం వల్ల తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వీలు ఉన్నప్పుడు, గర్భం 28 వారాలు దాటితే సిజేరియన్‌ ద్వారా బిడ్డను బయటకు తీయవచ్చు. ప్రసవం చేయగలిగితే, తల్లికి మరిన్ని ఎక్కువ మందులు వాడుకోగలిగే వీలు దొరుకుతుంది. వెంటిలేటర్‌తో అందే ఫలితం కూడా ప్రసవం తర్వాత పెరుగుతుంది. నిండు గర్భంతో ఉన్నప్పుడు శ్వాసకోశ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయలేదు. కాబట్టి ప్రసవం చేస్తే, వెంటిలేటర్‌ సహాయంతో శ్వాసకోశ వ్యవస్థ బలపడి, తల్లి కోలుకునే అవకాశాలు మెరుగవుతాయి. ఇలాంటి చికిత్సా విధానంతో వెంటిలేటర్‌ మీదకు వెళ్లిన గర్భిణులతో పాటు, బిడ్డనూ కాపాడుకోవచ్చు.




గర్భిణులు - వ్యాక్సిన్‌


గర్భిణులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎప్పుడైనా వేయించుకోవచ్చు. అయితే యుకె, అమెరికా, భారత మార్గదర్శకాల ప్రకారం 12 వారాల స్కాన్‌ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. 12 వారాల గర్భంలో పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించే వీలుంది. కాబట్టి ఆ సమయంలో స్కాన్‌ ద్వారా ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించుకోవడం అవసరం. అంతకంటే ముందే వ్యాక్సిన్‌ వేయించుకుని, ఆ తర్వాత స్కాన్‌లో లోపాలు కనిపిస్తే వ్యాక్సిన్‌ ప్రభావంగా అనుమానించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనుమానాలకు తావు లేకుండా 12 వారాల స్కాన్‌ అయిపోయిన తర్వాతే వ్యాక్సిన్‌ వేయించుకోవాలనే మార్గదర్శకాలు ఉన్నాయి.


కోరింత దగ్గు, టెటనస్‌, డిఫ్తీరియా మొదలైన వ్యాక్సిన్లను గర్భిణులకు ఇవ్వడం జరుగుతోంది. వీటి వల్ల గర్భిణుల్లో ఆయా వ్యాధులతో పోరాడే యాంటీబాడీలు తయారై, కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా అవి అందుతాయి. ఈ విఽధానమే కొవిడ్‌ వ్యాక్సిన్‌కూ వర్తిస్తుంది. కొవిడ్‌తో పోరాడే యాంటీబాడీలు తల్లి నుంచి బిడ్డకూ కొంత మేరకు అందుతాయి. బిడ్డకు ప్రసరించిన యాంటీబాడీల మోతాదు మీదే బిడ్డకు అందే కొవిడ్‌ రక్షణ ఆధారపడి ఉంటుంది.




పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌


పాలిచ్చే తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. వ్యాక్సిన్‌ తీసుకున్నంత మాత్రాన బిడ్డకు పాలివ్వడం మానవలసిన అవసరం లేదు. పాల ద్వారా తల్లి నుంచి ఆరోగ్య రక్షణ కల్పించే యాంటీబాడీలు బిడ్డకు సహజసిద్ధంగానే అందుతూ ఉంటాయి. అలాగే వాటితో పాటే కొవిడ్‌ యాంటీబాడీలు కూడా ఎంతో కొంత బిడ్డకు పాల ద్వారా అందుతాయి. కాబట్టి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నా బిడ్డకు నిరభ్యంతరంగా పాలివ్వడం కొనసాగించవచ్చు.


డాక్టర్‌ రాధికా రెడ్డి,

అబ్‌స్టెట్రీషియన్‌, గైనకాలజిస్ట్‌,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో,

  హైదరాబాద్‌.


Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST