టిడ్కో ఇళ్ల కేటాయింపునకు కసరత్తు

ABN , First Publish Date - 2020-11-25T06:51:44+05:30 IST

టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను అర్హులకు అందజేసేం దుకు జీవీఎంసీ కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 25న టిడ్కో ఇళ్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టిడ్కో ఇళ్ల కేటాయింపునకు కసరత్తు

వచ్చే నెల 25న కేటాయింపు పత్రాలు అందజేత


విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను అర్హులకు అందజేసేం దుకు జీవీఎంసీ కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెల 25న టిడ్కో ఇళ్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ పరిఽధిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. నిరుపేదల కోసం గత ప్రభుత్వం సుమారు 54 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అందులో 24,192 ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో అర్హులకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఎన్నికలు జరగడంతో ఆ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై దృష్టిసారించకపోవడంతో టీడీపీ, వామపక్షాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వం కేటాయించకపోతే తామే స్వాధీనం చేసుకుంటామంటూ లబ్ధిదారులు కూడా ప్రకటించడంతో ప్రభుత్వం మేల్కొంది. నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను వచ్చే నెల 25న లబ్ధిదారులకు కేటాయిస్తూ పత్రాలను అందజేయనున్నట్టు ప్రకటించింది. జీవీఎంసీ పరిధిలో 24,192 ఇళ్లు అందుబాటులో వుండగా, వైసీపీ ప్రభుత్వం పలుమార్లు నిర్వహించిన సర్వేలో 28 వేల మందిని అర్హులుగా గుర్తించింది. అర్హులైన వారిని నియోజకవర్గాల వారీగా విడదీసి లాటరీ విధానంలో ఇళ్లను కేటాయించనున్నట్టు జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం పట్టాలను అందజేసి, గతంలో వారు తీసిన డీడీలను వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-11-25T06:51:44+05:30 IST