టిడ్కో ఇళ్లకు మోక్షం

ABN , First Publish Date - 2020-06-03T10:15:47+05:30 IST

డ్కో ఇళ్లకు సంబంధించి కీలక అడుగు పడింది. వాటిని త్వరలోనే అర్హులకు అందజేసేందుకు ప్రభుత్వం ..

టిడ్కో ఇళ్లకు మోక్షం

లబ్ధిదారుల నుంచి అంగీకార పత్రాల సేకరణలో అధికారుల నిమగ్నం

 వచ్చే నెల 8న పంపిణీకి ఏర్పాట్లు


విజయనగరం టౌన్‌, జూన్‌ 2 : టిడ్కో ఇళ్లకు సంబంధించి కీలక అడుగు పడింది. వాటిని త్వరలోనే అర్హులకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేనెల 8వ తేదీన పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌, మరో నగర పంచాయతీలో గత ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాదిగా టిడ్కో ఇళ్లను నిర్మించింది. వీటికి సంబంధించి పనులన్నీ పూర్తిచేసి గృహ ప్రవేశానికి కూడా నిర్ణయించింది.  అంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే నెల 8న ఆ ఇళ్లు పూర్తిగా పేదలకు దక్కనున్నాయి.


విజయనగరం నగరపాలకసంస్థ, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో అర్హులైన పేదల నుంచిఅప్పట్లో ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. లబ్ధిదారులు ఎంచుకున్న ఇంటి చదరపు అడుగులు ఆధారంగా అడ్వాన్సులను స్వీకరించారు. 300,  360, 430 (మూడు కేటగిరీల్లో) చదరపు అడుగుల విస్తీర్ణంలో వాటి నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారుల నుంచి రూ.5000, రూ.25వేలు, రూ.లక్ష చొప్పున డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను తీసుకున్నారు. దాదాపు ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లే. వీటికి సంబంధించి అంగీకార పత్రాలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంగీకారం తెలిపిన వారికి వచ్చే నెల 8న ప్లాట్లు కేటాయించాలని భావిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా విజయనగరం పట్టణంలో 4వేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరిగింది. వాస్తవానికి నగరంలో ఈ ఇళ్ల నిర్మాణం కోసం పదివేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.


వీటిల్లో అర్హతలు పరిశీలించాక చివరకు 8 వేల దరఖాస్తులు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడంతో కొందరు లబ్ధిదారులు తమ వాటాను వెనక్కి తీసుకున్నారు. విజయనగరంలో సారిపల్లి, సోనియానగర్‌లలో చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు 70 శాతానికి పైగా పూర్తిచేసినట్లు టిడ్కో అధికారులు చెబుతున్నారు.


లబ్ధిదారుల్లో టెన్షన్‌

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లే టిడ్కో ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా అనేక మంది పేదలు ఇళ్లు కావాలని అడగడంతో రెండోదశలో మంజూరు చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం మారిపోవడంతో ఎంపికైన వారిలో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల తరువాత స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి టిడ్కో అధికారులతో సమావేశమై తాను చెప్పేవరకూ ఇళ్లు ఎవ్వరికీ ఇవ్వద్దని, అలాగే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన లబ్ధిదారుల జాబితాను కూడా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. దీంతో చాలా మంది పేదల మదిలో అనుమానాలు మొదలయ్యాయి. పేర్లు మారిపోతాయన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 8న ఇళ్లు దక్కేవి ఎవరికో అంటూ కొందరు ప్రతిరోజూ నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తమ పేర్లు ఉన్నాయో లేదో అని అధికారులను అడుగుతున్నారు. 


నిర్మించిన ఇళ్ల వివరాలు

విజయనగరం సారిపల్లిలో 2,752

 సోనియానగర్‌లో 1280

సాలూరులో 1440

బొబ్బిలిలో 2448

పార్వతీపురంలో 1104

నెల్లిమర్లలో 720


ప్రభుత్వ ఆదేశాల మేరకే..ఎస్‌ఎస్‌ వర్మ, కమిషనర్‌, విజయనగరం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తాం. ఇంకా నిర్దిష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన తరువాత అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2020-06-03T10:15:47+05:30 IST