చిరుత దాడి: అటవీ సిబ్బంది సహా ఐదుగురికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-28T14:45:38+05:30 IST

తిరుప్పూరులో చిరుతపులి సంచరి స్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ చిరుత గురువారం ఉదయం ఓ అరటితోటలో దాగి స్థానికులపై జరిపిన దాడిలో అటవీ శాఖ సిబ్బంది సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

చిరుత దాడి: అటవీ సిబ్బంది సహా ఐదుగురికి గాయాలు

చెన్నై: తిరుప్పూరులో చిరుతపులి సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ చిరుత గురువారం ఉదయం ఓ అరటితోటలో దాగి స్థానికులపై జరిపిన దాడిలో అటవీ శాఖ సిబ్బంది సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుప్పూరు జిల్లా అవినాశి సమీపం పాప్పాంకుళం గ్రామంలో ఈ నెల 24న చిరుతపులి దాడిలో రైతులు, అటవీ శాఖ సిబ్బంది సహా ఐదుగురు గాయపడ్డారు. ఆ సంఘటన తర్వాత ఆ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించడానికి సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయిన చిరుతపులి గురువారం ఉదయం తిరుప్పూరు నగరంలో ప్రత్యక్షమైంది. తిరుప్పూరు అమ్మాపాళయంలోని ఓ బనియన్ల కర్మాగారం వెనుక అరటితోటలో ఆ చిరుత దాగింది. విషయం తెలియని రైతు రాజేంద్రన్‌ (55) అరటి చెట్లకు నీరు పెట్టేందుకు వెళ్ళాడు. వెంటనే తోటలో ఉన్న చిరుత అతడిపై దాడి చేసింది. ఆ రైతు కేకలకు బనియన్ల  కర్మాగారం కార్మికులు అక్కడికి పరుగెత్తుకెళ్ళారు. వారి గుంపును చూసి ఆ చిరుత మళ్ళీ మరోచోట దాక్కుంది. చిరుత దాడిలో గాయపడిన రాజేంద్రన్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అరటి తోటలో దాగిన చిరుతపులిని తరిమికొట్టేందుకు ఓ ఎలక్ర్టీషియన్‌ వెళ్ళాడు. అతడిపై కూడా చిరుతపుల్లి దాడి జరిపింది. ఈ సమాచారం తెలుసుకుని అటవీ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి చిరుతను స్థానికుల సహకారంతో తరిమేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చిరుత జనంపై తిరిగ బడింది.  చిరుత దాడిలో ముగ్గురు అటవీశాఖ ఉద్యోగులు తీవ్రంగా గాయ పడ్డారు.. ఈ సమాచారం తెలుసుకుని తిరుప్పూరు నగర డీసీపీ అరవింద్‌  సిబ్బందితో సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ చిరుత తిరుప్పూరు నగరంలోకి చొరబడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టారు.


పట్టుబడిన చిరుతపులి..

ఐదుగురిని గాయపరచి తిరుగుతున్న చిరుతను అటవీ శాఖ అధికారులు మత్తు ఇంజక్షన్లు ప్రయోగించి నిర్బంధించారు. గురువారం మధ్యాహ్నం అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకునేందుకు అరటి తోట చుట్టూ నిఘా వేశారు. చివరకు ఓ చోట దాగి ఉన్న ఆ చిరుతను అటవీ శాఖ సిబ్బంది చుట్టుముట్టి మత్తు ఇంజక్షన్లను తుపాకులతో ప్రయోగించారు. ఆ చిరుతపులి మైకంలోకి జారుకున్న తరువాత అటవీ సిబ్బంది దానిని బంధించి బోన్‌లోకి ఎక్కించి తీసుకు వెళ్లారు. ఆ చిరుతకు వెటర్నరీ డాక్టర్‌ పరీక్షలు జరిపిన తర్వాత దానిని ఏ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటుమాని అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-01-28T14:45:38+05:30 IST