కుటుంబపెద్దను కలిపిన టిక్‌టాక్‌

ABN , First Publish Date - 2020-05-25T09:35:53+05:30 IST

రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మూగ వ్యక్తిని టిక్‌టాక్‌ వీడియో యాప్‌ అతడి కుటుంబానికి దగ్గర చేర్చింది.

కుటుంబపెద్దను కలిపిన టిక్‌టాక్‌

తప్పిపోయిన తండ్రి వద్దకు కుమారుడిని పంపిన అధికారులు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


బూర్గంపాడు, మే 24: రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మూగ వ్యక్తిని టిక్‌టాక్‌ వీడియో యాప్‌ అతడి కుటుంబానికి దగ్గర చేర్చింది. ఇంటినుంచి తప్పిపోయిన అతడు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు టిక్‌టాక్‌ వీడియోల్లో ఓ యువకుడి సహాయంతో కుటుంబసభ్యులు గుర్తించారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పుట్టుకతోనే మూగవాడు. రెండు సంవత్సరాల క్రితం కూలీ పని నిమిత్తం వెళ్లి ఇంటికి చేరలేదు. దీంతో వారం రోజుల పాటు పరిసర ప్రాంతాలు, సమీప బంధువులు ఇళ్లలో వెతికారు. అయినా జాడ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లుకి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అదే గ్రామానికి చెందిన కలసాని నాగేంద్రబాబు అనే యువకుడు టిక్‌టాక్‌ వీడియోలు చూస్తుండగా ఓ వీడియోలో వెంకటేశ్వర్లును గుర్తించి అతడి కుటుంబసబ్యులకు తెలిపాడు. టిక్‌టాక్‌ ఐడీ ఆధారంగా పంజాబ్‌ రాష్ట్రంలోని లూధియానా జిల్లాలో అతడు భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు.


ఈ విషయాన్ని ఈ నెల 19వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. పంజాబ్‌లో ప్రత్యక్షం’ అనే కథనం ప్రచురితమైంది. దాంతో స్పందించిన అధికారులు ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేసి వెంకటేశ్వర్లు కుమారుడు పెద్దిరాజును తండ్రి వద్దకు పంపించారు. ఆదివారం ఉదయం తండ్రి వద్దకు చేరుకున్న పెద్దిరాజును చూసిన వెంకటేశ్వర్లు కొడుకుని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈ దృశ్యాలను చూసిన కుటుంబసభ్యులు సైతం తబ్బిబ్బలయ్యారు. కాగా తండ్రి వద్దకు చేరుకునేందుకు బూర్గంపాడు జడ్పీటీసీ దంపతులు కామిరెడ్డి శ్రీలత, ఎంపీటీసీ తోటమళ్ల సరిత, గ్రామస్థుల సహకారంతో ప్రత్యేక వాహనంలో వెళ్లారు. ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్న అనంతరం తండ్రిని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం రాత్రికి ఇంటికి చేరుకునే ఆవకాశం ఉందని వారు తెలిపారు. 


పోలీసుల సహకారం అభినందనీయం

వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు రెండు సంవత్సరాలు క్రితం బూర్గంపాడు పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు. తాజాగా అతడినికి టిక్‌టాక్‌ వీడియోలో గుర్తించిన విషయాన్ని స్థానిక ఎస్‌ఐ బాలకృష్ణ దృష్టికి తీసుకవెళ్లారు. దాంతో ఎస్‌ఐ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో లాక్‌డౌన్‌ నిబంధనల నేపధ్యంలో ఖమ్మం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ బాధితుడి కుటుంసభ్యులను పంజాబ్‌ రాష్ట్రానికి పంపించేందుకు ప్రత్యేక అనుమతి పత్రాలు ఆందజేశారు. పంజాబ్‌ రాష్ట్ర సరిహద్దుతో పాటు పలు ప్రాంతాల్లో వీరి వాహనాన్ని అధికారులు నిలిపివేయడంతో ఎస్పీ అక్కడి అధికారులతో పోన్‌లో మాట్లాడారు. దీంతో వైద్య పరీక్షల అనంతరం అనుమతించినట్లు బాధితుడి కుమారుడు పెద్దిరాజు తెలిపాడు. తండ్రి వద్దకు చేర్చిన అధికారులతో పాటు, తన తండ్రి టిక్‌టాక్‌లో కనిపించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’కి వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.    

Updated Date - 2020-05-25T09:35:53+05:30 IST