మాకొక యాప్‌ కావలెను!

ABN , First Publish Date - 2020-07-05T05:30:00+05:30 IST

‘టిక్‌టాక్‌’... సామాన్యుడిని సైతం ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మార్చి ‘బాప్‌రే’ అనిపించిన యాప్‌. ఈ వినోదభరిత వేదికపై కేవలం పదిసెకన్లలో టాలెంట్‌ చూపి, ఆకట్టుకున్నవారు ఎంతోమంది. తమ కామెడీతో, డాన్స్‌తో, పాపులర్‌ పాటలకు లిప్‌ సింక్‌తో సోషల్‌ మీడియాలో...

మాకొక యాప్‌ కావలెను!

‘టిక్‌టాక్‌’... సామాన్యుడిని సైతం ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మార్చి ‘బాప్‌రే’ అనిపించిన యాప్‌. ఈ వినోదభరిత వేదికపై కేవలం పదిసెకన్లలో టాలెంట్‌ చూపి, ఆకట్టుకున్నవారు ఎంతోమంది. తమ కామెడీతో, డాన్స్‌తో, పాపులర్‌ పాటలకు లిప్‌ సింక్‌తో సోషల్‌ మీడియాలో కావాల్సినంత వినోదాన్ని అందించిన సామాన్యులు హఠాత్తుగా ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించడంతో డీలా పడ్డారు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మనదైన యాప్‌లు తెచ్చినా విజృంభిస్తామని అంటున్నారు.


రాజస్థాన్‌లోని ఉంకేరి గ్రామానికి చెందిన అనితా మీనాకు పాటలు పాడటం ఇష్టం. కానీ ఎప్పుడూ, ఎక్కడా తన టాలెంట్‌ను చూపించుకునే అవకాశమే రాలేదు. అయితే స్మార్ట్‌ఫోన్‌లోని ఒక యాప్‌ తన అభిరుచికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె ఎన్నడూ ఊహించలేదు. మొట్టమొదటిసారిగా ఒక పాట పాడి ‘టిక్‌టాక్‌’లో పోస్ట్‌ చేసింది. ఆ పాటకు చాలామంది ఫిదా అయ్యారు. దాంతో రెట్టించిన ఉత్సాహంతో పాటలు పాడి అప్‌లోడ్‌ చేయడం మొదలెట్టి నెమ్మదినెమ్మదిగా పాపులర్‌ అయ్యింది. ఆమె అకౌంట్‌ను ఇప్పుడు లక్షకు పైగా ఫాలో అవుతుండగా, పది లక్షలకు పైగా లైక్స్‌ చేరాయి. అనిత స్థానిక పంచాయితీ కమిటీలో సభ్యురాలు. బీఈడీ కోర్స్‌ ఎంట్రన్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. ‘టిక్‌టాక్‌’ బ్యాన్‌తో ఆమె తెగ ఫీలవుతోంది. ‘‘ ఈ చర్య నా జీవితంలో పెద్ద వెలితిని సృష్టించింది. టిక్‌టాక్‌లో నేను ప్రతీరోజూ 6 వీడియోలు ఆప్‌లోడ్‌ చేసేదాన్ని’’ అన్నారామె. అనితకు జానపద సంగీతమంటే ఇష్టం. దాన్ని ప్రమోట్‌ చేయడానికి ‘టిక్‌టాక్‌’లాంటి ఏదో ఒక వేదిక ఉంటే బాగుండేదనేది ఆమె అభిప్రాయం. ఏడాది క్రితం అనిత తొలిసారిగా ఒక రాజస్థానీ మీనా పాట పాడి అప్‌లోడ్‌ చేసింది. అప్పటి నుంచి ఆమె పాట కోసం రోజూ ఎంతోమంది ఎదురు చూసేవారు. టిక్‌టాక్‌లో పాపులర్‌ కావడంతో ఆ తర్వాత అనిత సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా మొదలెట్టారు. 


తిరుగులేని జంటలు...

మహారాష్ట్రకు చెందిన దినేశ్‌ పవార్‌, అతడి భార్య ధూలియాల స్ర్కీన్‌ కెమిస్ట్రీకి బాలీవుడ్‌ హీరోహీరోయిన్లకు ఉండేంత క్రేజ్‌ ఉంటుంది. వివిధ రకాల పాటలకు వీళ్లిద్దరూ కలిసి చేసిన డ్యాన్సులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో కూడా వైరల్‌ అయ్యాయంటే వీరికున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. గ్రామంలోని పచ్చని పొలాలు, రోడ్లు, రైలు పట్టాలు, వీధులే వీరి పాటలకు లొకేషన్లు. బాలీవుడ్‌ పాటలకు తగ్గట్టుగా ఈ జంట వేసే స్టెప్పులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ జంటకు 30 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉండటం విశేషం. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో మేమిద్దరం సరదాగా చేసిన వీడియోలు బాగా పాపులర్‌ అయ్యాయి. ‘వీ మేట్‌’ అనే యాప్‌కు కూడా వీడియోలు పోస్ట్‌ చేసి, నెలకు లక్ష రూపాయలు సంపాదించా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాం కానీ మాలాంటి వారి కోసం ‘టిక్‌టాక్‌’ వంటి భారతీయ యాప్‌ను తీసుకొస్తే బాగుంటుంది’’ అన్నారు దినేశ్‌. ఈయన లాగే మహారాష్ట్రలోని జామ్డే గ్రామానికి చెందిన ప్రకాశ్‌ చవాన్‌, అతడి భార్య వర్షలు కూడా ‘టిక్‌టాక్‌’ ద్వారానే పాపులర్‌ అయ్యారు. వారి డాన్సులు కూడా జనాలకు బాగా నచ్చాయి. ఈ జంటకు 8.5 లక్షల ఫాలోవర్స్‌ ఉండటం విశేషం. 


జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు సమీపంలోని కుశ్‌మంతాడ్‌ గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్‌ స్కూలులో పనిచేసే సనతన్‌కుమార్‌ మహతో అతడి సోదరి సావిత్రి కుమారీలు కూడా రకరకాల వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేసేవారు. వాటి ద్వారా వాళ్లిద్దరూ స్టార్‌లుగా మారిపోయారు. ఫిబ్రవరి దాకా  సనతన్‌ తానొక్కడే వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేసేవాడు. కానీ వాటికి అంతగా ఆదరణ ఉండేది కాదు. ఎప్పుడైతే సోదరి సావిత్రి అతడికి తోడయ్యిందో అప్పటి నుంచి వారి ప్రతీ వీడియో ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది. వీళ్లిద్దరూ ఎక్కువగా 1980, 90 దశకాల్లోని బాలీవుడ్‌ గీతాలకు మాత్రమే డాన్స్‌ చేశారు. వీళ్లిద్దరికీ టిక్‌టాక్‌ ద్వారా సుమారు 30 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ జంట చేసిన డ్యాన్సులకు సుమారు 6 కోట్ల లైకులు వచ్చాయంటే వారి ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ‘‘చిన్న గ్రామానికి పరిమితమైన మేము మా అభిరుచి మేరకు టాలెంట్‌ను ప్రదర్శించి అంతమందికి నచ్చడం నిజంగా అద్భుతమే కదా... మనదైన యాప్‌ కోసం ప్రస్తుతం ఆశగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు సావిత్రి. మొత్తానికి ‘టిక్‌టాక్‌’ అభిమానులంతా ఇప్పుడు మనదైన యాప్‌లో మరింత నాన్‌స్టాప్‌ వినోదాన్ని కోరుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం ‘స్టార్లు’ కూడా సిద్ధంగానే ఉన్నారు.



Updated Date - 2020-07-05T05:30:00+05:30 IST