అశ్విన్‌కు ఆసీస్ కెప్టెన్ క్షమాపణ.. చేసిన పనికి పశ్చాత్తాపం

ABN , First Publish Date - 2021-01-13T00:21:04+05:30 IST

భారత్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై అనుచితంగా ప్రవర్తించిన

అశ్విన్‌కు ఆసీస్ కెప్టెన్ క్షమాపణ.. చేసిన పనికి పశ్చాత్తాపం

సిడ్నీ: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై అనుచితంగా ప్రవర్తించిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన విపరీత ప్రవర్తనకు క్షమాపణలు కోరాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్వితీయ ఆటతీరు కనబరిచిన అశ్విన్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. వికెట్లకు అడ్డుగోడలా నిలిచిన అశ్విన్ జట్టు పరాజయం కాకుండా కాపాడాడు. క్రీజులో ఉన్నంత సేపు ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.


ఈ క్రమంలో కెప్టెన్ పైన్ పలుమార్లు అసహనం వ్యక్తం చేశాడు. ఫీల్డింగులో మూడు క్యాచ్‌లు వదిలేయడంతో మరింత చిరాకు ప్రదర్శించాడు. అశ్విన్ క్రీజులో పాతుకుపోవడంతో ఆ చిరాకును అతడిపై ప్రదర్శించాడు. నోరు పారేసుకున్నాడు. ఇది కాస్తా స్టంప్ మైక్‌లో రికార్డయింది. నేడు నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో పైన్ మాట్లాడుతూ.. నిన్నటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ‘‘నేనూ మనిషినే. చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.


 ‘‘ఈ జట్టును నడిపిస్తున్న తీరును చూసి నన్ను నేను గర్విస్తాను. కానీ నిన్న నా ప్రవర్తన ఏమంత బాగోలేదు’’ అని చెప్పుకొచ్చాడు. తన సారథ్యం బాగోలేదని, ఆట ఒత్తిడి తనపై పడి తన మూడ్‌ను పాడుచేసిందని, అది అంతిమంగా తన ప్రదర్శనపై పడిందని వివరించాడు. కెప్టెన్‌గా తాను చాలా పేలవ ప్రదర్శన కనబరిచానని, జట్టుకు తలవంపులు తెచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు. 


ఐదో రోజు మ్యాచ్ అనంతరం అశ్విన్‌తో మట్లాడుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు చెప్పాడు. ‘‘నేను వెర్రివాడినయ్యాను కదా’’ అని అని అశ్విన్‌తో అన్నానని పేర్కొన్నాడు. కాగా, మైదానంలో ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసినందుకు గాను పైన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత జరిమానా విధించారు.  


Updated Date - 2021-01-13T00:21:04+05:30 IST