డిగ్రీ ప్రవేశాలకు వేళాయె!

ABN , First Publish Date - 2021-09-17T05:19:41+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. విద్యార్థులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తమకు నచ్చిన కళాశాలకు, కావల్సిన కోర్సుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వర్సిటీల వారీగా అనుబంధ డిగ్రీ కళాశాలలు, కోర్సులు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు.

డిగ్రీ ప్రవేశాలకు వేళాయె!
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

- షెడ్యూల్‌ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

- నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 

- ఈ ఏడాది కొత్తగా రెండు కళాశాలలు

ఎచ్చెర్ల, సెప్టెంబరు 16: రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో శుక్రవారం నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. విద్యార్థులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తమకు నచ్చిన కళాశాలకు, కావల్సిన కోర్సుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వర్సిటీల వారీగా అనుబంధ డిగ్రీ కళాశాలలు, కోర్సులు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. జిల్లాల వారీగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీకి సంబంధించి శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 


షెడ్యూల్‌ వివరాలు..

డిగ్రీలో చేరేందుకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ఈ నెల 17 నుంచి 22వ తేదీలోగా ఓఏఎండీసీ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఏ కళాశాల.. ఏ కోర్సులో చేరుతారో ఈ నెల 23నుంచి 26లోగా వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవాలి. 29న సీట్లు కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు  సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీల్లో ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి. అక్టోబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 


అంబేడ్కర్‌ వర్సిటీలో కళాశాలల వివరాలు..

బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 86 ప్రైౖవేటు కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా పొందూరు, పలాసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. బీఆర్‌ఏయూ పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీవోసీ, తదితర కోర్సులకు సంబంధించి సుమారు 24,000 సీట్లు ఉన్నాయి. 


 గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి

డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు నిర్దేశించిన గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వారికి నచ్చిన కళాశాలలో  ప్రవేశించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల సౌలభ్యం కోసమే ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని   సద్వినియోగం చేసుకోవాలి. 

-ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు, వీసీ, అంబేడ్కర్‌ యూనివర్సిటీ 

Updated Date - 2021-09-17T05:19:41+05:30 IST