టైమ్ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌.. జో బైడెన్‌-కమల హ్యారిస్‌

ABN , First Publish Date - 2020-12-12T13:06:54+05:30 IST

టైమ్‌ మేగజీన్‌ ‘ఈ ఏటి మేటి వ్యక్తి(పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌)’గా అమెరికా అధ్యక్ష, ఉపాధ్య పదవులకు ఎన్నికైన జో బైడెన్‌, కమల హ్యారిస్‌ ఎంపికయ్యారు. అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, అమెరి కా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్స్‌వరకు పోటీలో ఉన్నా.. బైడెన్‌, హ్యారిస్‌ వారిని దాటుకుని ముందుకెళ్లారు.

టైమ్ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌.. జో బైడెన్‌-కమల హ్యారిస్‌

వాషింగ్టన్‌, డిసెంబరు 11: టైమ్‌ మేగజీన్‌ ‘ఈ ఏటి మేటి వ్యక్తి(పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌)’గా అమెరికా అధ్యక్ష, ఉపాధ్య పదవులకు ఎన్నికైన జో బైడెన్‌, కమల హ్యారిస్‌ ఎంపికయ్యారు. అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, అమెరి కా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్స్‌వరకు పోటీలో ఉన్నా.. బైడెన్‌, హ్యారిస్‌ వారిని దాటుకుని ముందుకెళ్లారు. ‘‘చేంజింగ్‌ అమెరికాస్‌ స్టోరీ’’ అన్న ఉపశీర్షికతో టైమ్‌ మేగజీన్‌ వారి ఘనత ను కీర్తించింది. 1927 నుంచి టైమ్‌ మేగజీన్‌ ఏటా ఆ సంవత్సరంలో ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి/వ్యక్తులకు గుర్తింపునిస్తూ.. తన కవర్‌పేజీపై చోటు కల్పించి గౌరవిస్తుంది. శక్తికి మించి పనిచేసిన, ప్రతిభ కనబర్చిన పలువురు వ్యక్తులకు టైమ్‌ మేగజీన్‌ వేర్వేరు కేటగిరీల్లో గుర్తింపునిచ్చింది. ‘గార్డియ న్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఆంథోనీ ఫౌసీ.. ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా జూమ్‌ సీఈవో ఎరిక్‌ యువాన్‌.. ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అమెరికా బాస్కెట్‌బాల్‌ ఆటగాడు లెబ్రోన్‌ జేమ్స్‌ ఎంపికయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన బ్యాండ్‌ బీటీఎస్‌ బృందానికి ‘ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గుర్తింపు లభించింది.


భారతీయ-అమెరికన్‌ సేవకు టైమ్‌ సలామ్‌..!

భారతీయ-అమెరికన్‌ రాహుల్‌ దూబేను టైమ్‌ మేగజీన్‌ ‘హీరో ఆఫ్‌ 2020’గా ఎంపిక చేసింది. మే నెలలో శ్వేతజాతి పోలీసు అధికారి చేతిలో నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్‌ హతమయ్యాక.. అమెరికా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. జూన్‌ 1న వాషింగ్టన్‌లో నిరసనకారులు పోటెత్తారు. దీంతో పోలీసులు రాత్రి కర్ఫ్యూ విధించారు. రాత్రి 7 గంటలు దాటగానే.. ఆందోళనకారులపై పెప్పర్‌ స్ర్పే ప్రయోగించారు. వారు కళ్ల మంటతో.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. బారికేడ్ల మధ్య బంధించి, దాడి చేశారు. ఆ దృశ్యాలు చూసిన రాహుల్‌ దూబే మనస్సు చివుక్కుమంది. ముందూవెనకా ఆలోచించకుండా.. తన ఇంటి తలుపులు తీసి.. ఆందోళనకారులకు ఆశ్రయమిచ్చాడు. 70 మందిని పోలీసుల దాడి, చలి బారి నుంచి కాపాడాడు. ఆ సేవకు టైమ్‌ గుర్తింపునిచ్చింది.

Updated Date - 2020-12-12T13:06:54+05:30 IST