‘టిమ్స్‌’లో సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2020-07-05T07:53:24+05:30 IST

హైటెక్‌సిటీ జోన్‌ పరిధిలో ఇప్పటికే అధునాతన సౌకర్యాలతో కొవిడ్‌-19 రోగుల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(టిమ్స్‌) ఆస్పత్రి 3 నెలలుగా

‘టిమ్స్‌’లో సర్వం సిద్ధం

  • అయినా 3 నెలలుగా వైద్యసేవలు నిల్‌..
  • రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
  • ప్రారంభానికి నోచుకుని గచ్చిబౌలి ఆస్పత్రి 
  • నేటి అత్యవసర భేటీలో ప్రారంభ తేదీ ఖరారు?

మియాపూర్‌/హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హైటెక్‌సిటీ జోన్‌ పరిధిలో ఇప్పటికే అధునాతన సౌకర్యాలతో కొవిడ్‌-19 రోగుల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(టిమ్స్‌) ఆస్పత్రి 3 నెలలుగా ప్రారంభానికి నోచుకోకుండా వృథాగా పడి ఉంది. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌ టిమ్స్‌ ఆస్పత్రిని పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభిస్తామని చెప్పినా జాప్యం జరుగుతూనే ఉంది. మరోపక్క హైటెక్‌సిటీ శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా.. బెడ్‌లు దొరకక రోగులు ఇ బ్బందులు పడుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు గచ్చిబౌలిలోని క్రీడాప్రాంగణం సమీపంలో ఉన్న 13 అంతస్తుల భవనంలో 1200 మంది రోగులకు సరిపడా ఏర్పాట్లను నెలరోజుల వ్యవధిలోనే అధికారులు పూర్తిచేశారు. అలాగే.. 3 నెలలకు సరిపడా కావాల్సిన మందులను కూడా మెడికల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. 25 వెంటిలేటర్లను ఎమర్జెన్సీ రోగుల కోసం సిద్ధం చేయడంతో పాటు 4 ఐసీయూ గదుల్లో 50 బెడ్‌లను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆధునిక పరికరాలనూ అందుబాటులో ఉంచారు. టిమ్స్‌ ఆస్పత్రి కోసం ఇప్పటికే 70మంది వైద్యులు, 210 మంది నర్సులను తీసుకున్నారు. అయితే ఈ ఆస్పత్రిలో కొవిడ్‌ కేసులను అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


జాప్యానికి కారణం ఇదేనా? 

వైద్యపరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ టెక్నిషియన్స్‌, వైద్యులకు అసిస్టెంట్లను ఇప్పటివరకు తీసుకోలేదు. అలాగే శానిటేషన్‌ కోసం పూర్తి స్థాయ సిబ్బంది నియామకం జరగలేదు. రోగులకు ఆహారం అందించే డైట్‌సెంటర్‌ విషయంలో కూడా ఏర్పాట్లు జరగలేదు. ఈ కారణాల వల్ల ఆస్పత్రి ప్రారంభం జాప్యమవుతోందనే ఆరోపణలున్నాయి. టిమ్స్‌ ఆస్పత్రికి సమీపంలోని శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో ఇప్పటికే 1500 కేసులు నమోదయ్యాయి. 15మంది మృత్యువాత పడ్డారు. కొండాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో 14మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిని మూసివేసే పరిస్థితి ఏర్పడింది.


ఈ నేపథ్యంలో టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. కాగా, టిమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విమలథామస్‌ ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.  ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో భేటీ అవుతారు. ఆస్పత్రిని ప్రారంభించడానికి, కొవిడ్‌ రోగులను అనుమతించే విషయమై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం నుంచి టిమ్స్‌లో వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువస్తారని విశ్వసనీయంగా తెలిసింది. 


టిమ్స్‌లో సేవలను ఆరంభించాలి

అత్యంత అధునాతన సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న టిమ్స్‌ ఆస్పత్రిని త్వరగా ప్రారంభించడం మేలు. ఎంతమాత్రం జాప్యం చేయకుండా వెంటనే వైద్యసేవలను అం దించాలి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. 

తాడిబోయిన రామస్వామియాదవ్‌, ప్రముఖ సంఘ సేవకుడు     

Updated Date - 2020-07-05T07:53:24+05:30 IST