Abn logo
Sep 23 2021 @ 11:41AM

కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టే అద్భుతమైన చిట్కాలు!

ఆంధ్రజ్యోతి(23-09-2021)

కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలు చాలా ఉంటాయి. నిద్రలేమి, పోషకాహార లోపం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం, అలర్జీ... ఇలా చాలా అంశాలు నల్లటి వలయాలకు కారణమవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఏం చేయాలంటే...


కీర దోసను ముక్కలుగా కట్‌ చేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత వాటిని పావుగంట పాటు కళ్లపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగిన విశ్రాంతి లభిస్తుంది. నల్లటి వలయాలు నెమ్మదిగా దూరమవుతాయి.


అలొవెరా అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన మాయిశ్చర్‌ని అందిస్తుంది. అలొవెరాను కొద్దిగా కట్‌ చేసి జెల్‌ను కళ్ల కింద భాగంలో రాయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి.


టొమాటోను కట్‌ చేసి ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు అలా వదిలేస్తే ఫలితం ఉంటుంది. ఒక టీస్పూన్‌ టొమాటో జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేసినా ఫలితం కనిపిస్తుంది.


కొద్దిగా దూది తీసుకుని రోజ్‌ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. పావుగంటపాటు ఇలా చేయడం వల్ల కళ్లు రీఫ్రెష్‌ అవుతాయి. 


గ్రీన్‌టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్‌ డార్క్‌ సర్కిల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. గ్రీన్‌ టీ తయారుచేసుకున్నాక ఆ టీ బ్యాగ్‌ని పడేయకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లటి టీ బ్యాగ్‌ని కళ్లపై పెట్టుకుంటే డార్క్‌ సర్కిల్స్‌ పోతాయి.


బంగాళదుంపను గుజ్జుగా చేసి, ఆ గుజ్జును కళ్లపై పావుగంట పాటు ఉంచితే చాలు. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు దూరమవుతాయి. 

ప్రత్యేకంమరిన్ని...