జీవన మంత్రం: పిల్లలు మీమీద కోపంతో రగిలిపోతున్నప్పుడు ఇలా చేయండి.. క్షణాల్లో మీ ఒళ్లో వాలిపోతారు!

ABN , First Publish Date - 2021-11-25T13:59:47+05:30 IST

ప్రస్తుత ఉరుకులు పరుగుల యుగంలో..

జీవన మంత్రం: పిల్లలు మీమీద కోపంతో రగిలిపోతున్నప్పుడు ఇలా చేయండి.. క్షణాల్లో మీ ఒళ్లో వాలిపోతారు!

ప్రస్తుత ఉరుకులు పరుగుల యుగంలో తల్లిదండ్రులు వృత్తి వ్యాపకాల్లో మునిగితేలుతూ తమ పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు చిన్నపాటి తప్పుచేసినా వారిపై తల్లిదండ్రులు చిందులు తొక్కుతున్నారు. ఫలితంగా పిల్లలు ఒంటరితనానికి గురవడానికి తోడు, కోప స్వభావాన్ని పెంచుకుంటున్నారు. ఒకవేళ మీ పిల్లలు కూడా ఇటువంటి స్వభావం కలిగివుంటే కొన్ని ఉపాయాల ద్వారా వారిలోని అసంతృప్తిని పోగొట్టి, బుద్దిమంతులుగా మలచండి. 


బయటి వాతావరణంలో తిప్పండి

అవసరానికి మించి పిల్లలలు టీవీ లేదా మొబైల్ ఫోను చూస్తూ కూర్చుంటే, తల్లిదండ్రులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు పిల్లలపై కోపం చూపించేందుకు బదులు ప్రేమతో వారికి అన్ని విషయాలపై అవగాహన కల్పించండి. వారిని పార్కులు లాంటి ప్రదేశాలకు తీసుకువెళ్లి, ప్రకృతిపై వారికి ప్రేమ కలిగేలా చేయండి.

మీ మాట వినేవారిగా మార్చుకోండి

మీరు ఎప్పుడూ పిల్లల తప్పులను ఎత్తిచూపిస్తూ, వారిని మందలించేబదులు వారి సమస్యలను తెలుసుకుని, వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వలన పిల్లలు మీ మాట వినేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ మీద వారికి నమ్మకం, గౌరవం ఏర్పడతాయి. 

పిల్లలకు తగినంత ప్రైవసీ ఇవ్వండి 

పిల్లలకు ప్రైవసీ ఇవ్వాలనే మాట వినగానే తల్లిదండ్రులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే పిల్లలకు కొంతమేరకు ప్రైవసీ ఇవ్వడం తప్పనిసరి. పిల్లలు కోపంతో ఒక మూలకు వెళ్లి కూర్చుంటే.. వారిని కాసేపు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత మీరు వారి దగ్గరకు వెళ్లి, సమస్యపై అవగాహన కల్పించి పరిష్కారం చూపండి.


సానుభూతి చూపించండి

చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై పలు సందర్భాలలో చికాకు ప్రదర్శిస్తుంటారు. వారి తప్పులను ఎత్తిచూపిస్తూ, నిందిస్తుంటారు. ఇటువంటప్పుడు పిల్లలు మొండిగా తయారవుతుంటారు. అందుకే వారిపై చికాకు ప్రదర్శించే బదులు సానుభూతి చూపించండి. ప్రేమతో మెలగండి. 


మీ పిల్లలు కోప స్వభావంతో ప్రవరిస్తూ, మొండితనం చేస్తూ ఉంటే వారిని శాంతింపజేసేందుకు, వారి మైండ్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించండి. ఇటువంటి సందర్భంలో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను ఇవ్వండి. దీంతో వారు వెంటనే శాంతి స్వభావులైపోయి, మీకు మరింత దగ్గరవుతారు.

Updated Date - 2021-11-25T13:59:47+05:30 IST