Abn logo
Oct 18 2020 @ 02:47AM

వెంకన్నాస్‌ గోల్డ్‌తో సర్కారు లోన్‌!

శ్రీవారి బంగారంతో సర్కారు రుణ ‘ప్రణాళిక’

1500 కిలోల బంగారం ఎస్‌బీఐలో డిపాజిట్‌

ఐవోబీ నుంచి కరోనా టైమ్‌లోనే తరలింపు

బాబాయ్‌ నేతృత్వంలోని బోర్డు తీర్మానం

ప్రభుత్వ అప్పులకు పరోక్షంగా ‘సెక్యూరిటీ’

గతంలో ఏం చూసి అప్పు ఇవ్వాలన్న ఎస్‌బీఐ

ఇప్పుడు సర్కారువారి అప్పుల కార్పొరేషన్‌కు

కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐ క్యాప్‌ నియామకం

కన్సల్టేషన్‌ ఫీజుగా రూ.40 కోట్లు చెల్లింపు

ఇప్పించే రుణం నుంచి అదనంగా కమీషన్‌ 


ఇది మామూలు స్కెచ్‌ కాదు! వెంకన్న బంగారంతో జగనన్న సర్కారు పుష్కలంగా అప్పులు తెచ్చుకునేందుకు వేసిన స్కెచ్‌! స్వామి వారికి భక్తులు సమర్పించుకున్న బంగారమే పరోక్ష ‘పెట్టుబడి’గా పెట్టి... ఎస్‌బీఐ ద్వారా రుణాలు తెచ్చుకునేందుకు వేసిన భారీ ప్రణాళిక! కళ్లు తిరిగే ‘వెంకన్నాస్‌ గోల్డ్‌’ కథ మీరూ చూడండి!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘ఏం చూసి మీకు అప్పులు ఇవ్వాలి!’

అని భారతీయ స్టేట్‌బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వాన్ని 

గతంలో లిఖితపూర్వకంగానే ప్రశ్నించింది.

ఇప్పుడు... అదే ఎస్‌బీఐ ‘మీకు అప్పులిస్తాం. 

ఇతరులతోనూ అప్పులు ఇప్పిస్తాం’ 

అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కన్సల్టెంట్‌గా మారింది.

‘సారీ’కి ‘సరే’కు మధ్య ఏం జరిగిందంటే... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన దాదాపు 1500 కిలోల బంగారం ఎస్‌బీఐ బులియన్‌ బ్రాంచ్‌కు డిపాజిట్‌ రూపంలో చేరింది. ఈ లింకులు అర్థం కావాలంటే, విషయాన్ని మరింత లోతుగా తెలుసుకోవాల్సిందే!

శ్రీవారికి భక్తులు నగదుతోపాటు బంగారు నగలనూ కానుకగా సమర్పిస్తుంటారు. ఆ బంగారాన్ని 99.9 స్వచ్ఛమైన బిస్కెట్లుగా మార్చి, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తుంటారు. దీనిపై బ్యాంకులు వడ్డీ రూపంలో బంగారాన్ని తిరిగి చెల్లిస్తాయి. ఇలా... తిరుపతిలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐవోబీ)లో టీటీడీ బంగారం డిపాజిట్‌ చేసింది. ఇందులో... ఈ ఏడాది జూన్‌ 17న 409 కేజీలు, జూన్‌ 19వ తేదీన 1118 కేజీల బంగారం డిపాజిట్‌  మెచ్యూరిటీ పొందింది. అంటే... మొత్తం 1527 కిలోల బంగారం! కాలావధి ముగిసిన బంగారాన్ని ముంబైలోని ఎస్‌బీఐ బులియన్‌ బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేయాలని టీటీడీ ‘ముందుగానే’ నిర్ణయించుకుని... ఇండియన్‌ ఓవర్సీ్‌సబ్యాంకుకు ఆ సమాచారం పంపింది. అయితే... కరోనా లాక్‌డౌన్‌తో బంగారం దిగుమతులు ఆగిపోయాయని, డిపాజిట్లను మరో ఆరునెలలు పొడిగించాలని ఐవోబీ కోరింది. ఈ 6 నెలల కాలానికి కూడా 1.25 శాతం వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. అయితే, తాము 12 ఏళ్ల దీర్ఘకాలిక డిపాజిట్‌ చేస్తే, ఎస్బీఐ 2.5 శాతం వడ్డీ చెల్లిస్తోందని, ఆరునెలలకు కూడా అదే వడ్డీ ఇవ్వాలని టీటీడీ కోరింది.  అం దుకు కూడా ఐవోబీ అంగీకరించింది. జూన్‌ 19వ తేదీ నాటికి మెచ్యూరిటీ పొందిన బంగారంలో 575 కేజీల బంగారాన్ని అనుకున్న సమయానికే ముంబైలోని ఎస్‌బీఐ బులియన్‌ బ్రాంచ్‌కు చేరవేస్తామని, మిగిలిన 543 కేజీల బంగారాన్ని ఆరు నెలల్లోగా అందజేస్తామని, ఆలస్యం అయిన కాలానికి 2.5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తామని ఐఓబీ చెప్పింది. ఆరునెలలు కూడా ఆగకుండానే... జూన్‌ 24వ తేదీకే మొత్తం బంగారం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసింది. ఒక్కరోజు ఆలస్యానికి జరిగిన చెల్లింపులపైనా వడ్డీని లెక్కించి ఇచ్చేసింది.


ఎస్బీఐకే ఎందుకు?

బ్యాంకు ఏదైతేనేం... వెంకన్న బంగారానికి ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తే అక్కడ డిపాజిట్‌ చేస్తే తప్పేముంది? అని ప్రశ్నించవచ్చు. కానీ... అబ్బా యి జగన్‌ సర్కారుకు బాబాయి వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్న టీటీడీ బోర్డు ‘కొండంత’ అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బలమైన అనుమానాలున్నాయి. ఇందులో భాగంగానే వెంకన్న గోల్డ్‌ను ఎస్‌బీఐలో డిపాజిట్‌ చేసినట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాల లాంగ్‌టర్మ్‌ డిపాజిట్‌కు 2.5 శాతం వడ్డీ చెల్లిస్తామని ఎస్‌బీఐ చెప్పిందట! అందుకే, ఆ బ్యాంకును ఎంచుకున్నారట! కానీ... స్వల్ప ఆలస్యానికి సైతం అంతే వడ్డీ ఇచ్చేందుకు ఐవోబీ అంగీకరించి, ఆ మేరకు చెల్లింపులు కూడా చేసింది. అడిగితే 2.5 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఐవోబీ సైతం అంగీకరించేది. కానీ, ముందుగానే ఎస్‌బీఐని ‘సెలెక్ట్‌’ చేసుకున్నారు. నిజానికి, ఒక దశలో తమకు అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎస్‌బీఐని ఆశ్రయిస్తే... ‘ఏం చూసి మీకు అప్పివ్వాలి?’ అని ఎస్‌బీఐ అధికారులు సూటిగా ప్రశ్నించారు. అదే ఎస్‌బీఐ ఇప్పుడు మన రాష్ట్రానికి ‘ఫేవరెట్‌’ బ్యాంక్‌గా మారింది. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అతిపెద్ద బ్యాంకు ఇదే. అందువల్ల, ఇందులో ఇతరత్రా లావాదేవీలున్నాయని చెప్పలేంకానీ, రాష్ట్రానికి అప్పులు ఇచ్చేందుకు, అప్పులు ఇప్పించేందుకే ఎస్‌బీఐకి టీటీడీ బంగారాన్ని ఎర వేశారని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. టీటీడీకి చెందిన 1500 కిలోల బంగారాన్ని డిపాజిట్‌ చేయించినందుకు... బదులుగా, బ్యాంకు నుంచి సర్కారుకు అప్పులు లభించే అవకాశముంది. అంతేకాదు, కేవలం అప్పుల కోసమే సృష్టించిన ‘ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌’కు ‘ఎస్‌బీఐ క్యాప్‌’ను కన్సల్టెంట్‌గా నియమించారు. దీనికి ఫీజుకింద సుమారు రూ.40 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. పైగా,  ఆదాయం లేని ఆ కార్పొరేషన్‌ను చూపి తేవాలనుకుంటున్న రూ.25,000 కోట్ల రుణానికి ప్రాసెసింగ్‌ ఫీజు కింద ఇంకో రూ.25 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ప్రభుత్వం అప్పుల కోసం ఎన్ని వ్యూహాలనైనా అమలు చేయవచ్చు. కానీ... దీనికి టీటీడీ బంగారాన్ని వాడుకోవడం సరైనదేనా!???


గతంలో ‘నో’ అన్నప్పటికీ... 

‘టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ సిఫారసుల’ పేరిట అకౌంట్‌ సెక్షన్‌ టీటీడీ పాలక మండలికి పంపిన ప్రతిపాదనను పరిశీలిస్తే... గతంలోనూ వెంకన్న బంగారాన్ని సర్కారు అప్పులకోసం పరోక్షంగా వాడుకోవాలనే ప్రయత్నం జరిగినట్లు స్పష్టమవుతుంది. అప్పట్లో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దానికి అడ్డుపుల్ల వేశారు. ఉన్నబ్యాంకు నుంచి తీసి ఎస్‌బీఐలో ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఈసారి, టీటీడీ బోర్డు అదే తీర్మానాన్ని ఆమోదించేసి ఎస్‌బీఐకి పట్టం కట్టింది.