తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు?

ABN , First Publish Date - 2021-03-14T00:33:35+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. బీజేపీ అభ్యర్థినే ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాలని అనుకుంటున్నాయి.

తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు?

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. బీజేపీ అభ్యర్థినే ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపికపై బీజేపీ-జనసేన సమాలోచనలు చేస్తున్నాయి. అభ్యర్థిపై బీజేపీ కసరత్తు కొలిక్కి వస్తోంది. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను ఆ పార్టీ పరిశీలించింది. అయితే వీరిలో ప్రముఖంగా రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పేరు వినిపిస్తోంది. మరో రెండ్రోజుల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో దాసరి శ్రీనివాసులు వివిధ హోదాల్లో పనిచేసి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదవీ విమరణ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో ముందునుంచే దాసరి పేరు వినిపిస్తోంది. అయితే బీజేపీ-జనసేన రెండు పార్టీల పొత్తు వల్ల ఆయన పేరును ప్రస్తావించలేదు. ఇప్పుడు బీజేపీకి లైన్ క్లియర్ కావడంతో దాసరినే బరిలోకి దింపాలని ఇరు పార్టీల వ్యూహంగా ఉంది.


తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కరోనాతో కన్నుమూశారు. దుర్గాప్రసాద్ అకాలమరణంతో తిరుపతి లోక్‌సభకు ఎన్నిక అనివార్యమైంది. అయితే తిరుపతి లోక్‌సభకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అందరికంటే ముందుగా టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు. విజయం కోసం ఆయన ఐదంచెల వ్యూహం రూపొందించారు. ఇక.. అధికార పార్టీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే దుర్గా ప్రసాద్ కుటుంబం నుంచే అభ్యర్థిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.


Read more