తిరుపతిలో మెజారిటీ పెరిగినా.. విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి!

ABN , First Publish Date - 2021-05-04T17:39:00+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ..

తిరుపతిలో మెజారిటీ పెరిగినా.. విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి!

నెల్లూరు జిల్లా సెగ్మెంట్లలోనే వైసీపీకి అధిక మెజారిటీ


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి నెల్లూరు జిల్లా పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనే అధిక మెజారిటీలు వచ్చాయి. తిరుపతి లోక్‌సభ పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు.. నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లె సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడింటిలోనూ అధికార పార్టీకే మెజారిటీ వచ్చినా.. సెగ్మెంట్ల వారీగా చూస్తే తొలి మూడు స్థానాలూ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లె, వెంకటగిరి, సూళ్లూరుపేట దక్కించుకున్నాయి. ఆరో స్థానం కూడా ఆ జిల్లాకు చెందిన గూడూరుకే దక్కింది.


ఇక, చిత్తూరు జిల్లాలో 4వ స్థానంలో శ్రీకాళహస్తి, 5వ స్థానంలో సత్యవేడు, చివరి స్థానంలో తిరుపతి ఉన్నాయి. గత ఎన్నికలల్లో టీడీపీకి మెజారిటీ వచ్చిన తిరుపతి సెగ్మెంట్‌లో ఇపుడు వైసీపీకి 34 వేలకు పైగా మెజారిటీ రావడం నిజానికి గొప్పే. అయితే తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు పోలైన నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెజారిటీల జాబితాలో తిరుపతి చివరి స్థానంలో నిలవడం స్థానిక వైసీపీ వర్గాలకు ఇబ్బందికరంగా పరిణమించింది. చిత్తూరు జిల్లాలోని మూడు సెగ్మెంట్లు కూడా జాబితాలో కిందివైపు చేరడం జిల్లాకు చెందిన ముఖ్యనేతలకు కూడా అసంతృప్తిని మిగిల్చిందని పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది.


నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్యనేతలతో పోలిస్తే చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్యనేతలకు అధిష్ఠానంలో పలుకుబడి, ప్రాధాన్యమున్న నేపథ్యంలో ఇక్కడ ఇలా జరగడం వారికి మింగుడుపడలేదని సమాచారం. మొత్తమ్మీద గతానికంటే మెజారిటీ పెరిగినా ఆ విజయాన్ని ఆస్వాదించే పరిస్థితిలో జిల్లాకు చెందిన ముఖ్యనేతలు, నియోజకవర్గ స్థాయి నేతలు లేరని సమాచారం.


సెగ్మెంట్‌       వైసీపీ మెజారిటీ

---------------------------

1. సర్వేపల్లె    40895

2. వెంకటగిరి    40863

3. సూళ్ళూరుపేట    39885

4. శ్రీకాళహస్తి    39469

5. సత్యవేడు    38487

6. గూడూరు    36492

7. తిరుపతి    34692

Updated Date - 2021-05-04T17:39:00+05:30 IST