తిరుపతి ఉప ఎన్నిక వైసీపీకి గుణపాఠం కావాలి

ABN , First Publish Date - 2021-01-17T06:53:45+05:30 IST

వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి ఉప ఎన్నిక ప్రజలకు మంచి అవకాశమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక  వైసీపీకి గుణపాఠం కావాలి

టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం


తిరుపతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి ఉప ఎన్నిక  ప్రజలకు మంచి అవకాశమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.  టీడీపీ క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, సమన్వయకర్తలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గాలపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని, అన్ని వర్గాల ప్రజలు కసిగా ముందుకొస్తున్నా రన్నారు.సెక్యులర్‌ పార్టీగా మత సామరస్యం కాపాడడం టీడీపీ బాద్యతన్న ఆయన ఈనెల 21నుంచి చేపట్టనున్న ధర్మపరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 10రోజుల పాటు 700గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాకు అనేక ప్రశంసలు దక్కాయని, తిరుపతి నగరానికి 3 అవార్డులు వచ్చాయన్నారు. హార్డ్‌వేర్‌ హబ్‌గా తిరుపతిని తయారుచేశామని,జిల్లాలో రూ. లక్షకోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 95వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. పెప్సికో, క్యాడ్బరీ, ఇసుజు, హీరో మోటాకార్స్‌, రిలయన్స్‌, కోబాల్కో పరిశ్రమలు టీడీపీ తెచ్చినవే అన్నారు.వైసీపీ వచ్చాక ఒక్క కంపెనీ తేకపోగా అమరరాజా ఇన్‌ప్రాటెక్‌ భూములు లాక్కోబోయారని,పారిశ్రామికవేత్తలను బెదిరించి తరిమేశారని ఆరోపించారు. టీటీడీ బోర్డులో అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యత ఇవ్వగా వైసీపీ నేతలు ఇప్పుడంతా నాశనం చేశారని, తిరుమల తిరుపతి పవిత్రతకే కళంకం తెచ్చారని విమర్శించారు. తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ మళ్లీ ముమ్మరమైందన్నారు.దేవదాయ భూములు అమ్మడం, ఒకే సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడం ద్వారా సామాజిక ద్రోహానికి, దైవ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీని ఓడించడం ద్వారా చారిత్రాత్మక తీర్పుకు తిరుపతి వేదిక కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వర్ధంతి తర్వాత తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ఉధృతం చేయాలన్నారు. తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, పాశం సునీల్‌ కుమార్‌, నెలవల సుబ్రమణ్యం, రామకృష్ణా రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు జేడీ రాజశేఖర్‌, జొజ్జల సుధీర్‌ రెడ్డి, నూకసాని బాలాజీ తదితరులు ప్రసంగించారు. 


తిరుపతి, రాజంపేట టీడీపీ ప్రధాన కార్యదర్శుల నియామకం 

 తిరుపతి పార్లమెంట్‌  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వేనాటి సతీష్‌రెడ్డి, రాజంపేట ప్రధాన కార్యదర్శిగా యాలగిరి దొరస్వామి నాయుడు నియమితులయ్యారు.


Updated Date - 2021-01-17T06:53:45+05:30 IST