తిరుపతిలో విజయంపై టీడీపీకి చిగురిస్తున్న ఆశలు.. ప్లస్ పాయింట్స్ ఇవే..!

ABN , First Publish Date - 2021-04-13T17:50:58+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై టీడీపీకి ఆశలు చిగురిస్తున్నాయా?..

తిరుపతిలో విజయంపై టీడీపీకి చిగురిస్తున్న ఆశలు.. ప్లస్ పాయింట్స్ ఇవే..!

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయంపై టీడీపీకి ఆశలు చిగురిస్తున్నాయా?... ఓటర్లలో వచ్చిన మార్పు ఏమిటి?... ఫ్యానుకి ఎదురుగాలి ఎందుకు వీస్తుంది?... మెజార్టీలపై పందాలు కాసిన వారు, ఇప్పుడు గెలుపు ఓటములపై పందాలు ఎందుకు కాస్తున్నారు?... చిట్టమూరులో అసలేం జరిగింది?... చిల్లకూరులో మంత్రి అనిల్ కుమార్‌కు ఆగ్రహం ఎందుకొచ్చింది?... మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎందుకని తలలు పట్టుకుంటున్నారు? అనే ఈ ఆసక్తికర అంశాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


వైసీపీ పెద్దలకు కంటిమీద కునుకులేదట

తిరుపతి ఉప ఎన్నికలో అడకత్తెరలో పోకచెక్కలా మారిందట వైసీపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల పరిస్థితి. సీఎం జగన్ నేతలకు 5 లక్షల మెజార్టీ టార్గెట్‌ విధించి.. ప్రచారంలో దూసుకుపోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని, ఒక్కో ఎమ్మెల్యేని ప్రత్యేకంగా పంపించారు. రోజులు గడిచే కొద్ది మెజార్టీ సంగతి పక్కన పెడితే జరుగుతున్న పరిణామాలు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లకు, వైసీపీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయట.


టీడీపీకి ప్లస్ పాయింట్ ఇదే..

వైసీపీలో గ్రూప్‌ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు ఆశించి చాలామంది నేతలు భంగపడ్డారు. వారంతా ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్నారట. ఉప ఎన్నికల్లో వీరంతా పార్టీ కోసం పనిచేస్తారా? లేక ఎదురుతిరుగుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించడంతో.. ప్రజలకు పెద్దగా తెలియని ఆయనకు ఓట్లు వేస్తారా అన్న భయం పట్టుకుందట. పనబాక లక్ష్మీ నెల్లూరీయురాలు కావడం, చాలాకాలంగా రాజకీయాల్లో ఉండటం టీడీపీకి ప్లస్ పాయింట్‌ అని అంటున్నారు.


ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టడం లేదట..

అయితే వైసీపీ నేతలు ప్రచార సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు జనాన్ని రమ్మంటే..పని ఉంది పోమ్మని ముఖం మీదే చెప్పేస్తున్నారట. మంత్రి అనిల్ కుమార్‌కు గూడూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఉన్న మూడు గ్రూపుల్లో.. ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టడం లేదని టాక్. రెండు గ్రూపుల నేతలు ప్రచారానికి రమ్మంటే పారిపోతున్నారట. కేవలం ఎమ్మెల్యే వరప్రసాద్ వర్గం మాత్రమే క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారం మొదలయ్యాక, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కుట్రలు, కుతంత్రాలు తనకి తెలియవని, పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.


షాకైన మంత్రి అనిల్..

మొన్న వరగలి క్రాస్ రోడ్డు నుంచి తిక్కవరం వరకు వైసీపీ నేతలు రోడ్ షో నిర్వహించారు. కానీ ఆ రోడ్ షోకి జనం కరవయ్యారట. దాంతో మంత్రి అనిల్ కుమార్‌కు చిర్రెత్తుకొచ్చి నేతలకు గట్టిగానే క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. ఏం...నలుగురు జనాల్ని కూడా పోగేయలేరా? జనం లేకుంటే, ఆ ప్రభావం పార్టీపై పడుతుందని తెలియదా అని రుసరుసలాడారని చెబుతున్నారు. ఆ తర్వాత చిల్లకూరు మండలం అంకులపాటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యిందట. ముందుగా ఏర్పాట్లు చూద్దామని వెళ్లిన మంత్రి అనిల్ కుమార్ అక్కడి వ్యవహారం చూసి షాక్‌ అయ్యారట. జనం లేకుండా బహిరంగ సభలేమిటి అంటూ స్థానిక నేతలపై చిందులు తొక్కినట్లు సమాచారం. తీవ్ర అసహనంతో ఆయన అటు నుంచి అటే వెనుదిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


వైసీపీలో ఆందోళన.. ఏం జరుగుతుందో..!

ఇక చిట్టమూరు మండలం కొత్తగుంటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి,  అనిల్ కుమార్ పాల్గొన్నారు.  అయితే సభ ముగియక ముందే..వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగడం..కుర్చీలు విసురుకోవడం వారిని నిశ్చేష్టులను చేసిందట. ఇటీవల పార్టీలోకి వచ్చిన ఓ నేతని స్టేజీపైకి ఆహ్వానించడమే ఇందుకు కారణమని సమాచారం. నేతలు, కార్యకర్తల ఫైటింగ్‌ చూసి..కాస్తో కూస్తో వచ్చిన జనం కూడా భయంతో పరుగులు పెట్టారట. దాంతో వైసీపీ ప్రచార కార్యక్రమాలకు జనం రాకపోవడం, నేతల మధ్య విభేదాలు భగ్గుమంటుండటం ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లకు టెన్షన్‌గా మారిందట. పోలింగ్‌లో మెజార్టీ తగ్గితే, జగన్ దగ్గర తమ పరువు పోతుందని, భవిష్యత్తులో ఆశించిన పదవులు రావని ఆందోళనచెందుతున్నట్లు టాక్. ఇదే అవకాశంగా అత్యధికంగా ఓట్లు రాబట్టేందుకు టీడీపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరుపతిలో విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి తిరుపతిలో ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయి..ఏ పార్టీ జెండా ఎగురుతుందన్నది తెలియాలంటే వెయిట్‌ అండ్‌ సీ.



Updated Date - 2021-04-13T17:50:58+05:30 IST