మొక్కుబడి అజెండాతోనే ?!

ABN , First Publish Date - 2021-04-22T06:32:13+05:30 IST

తిరుపతి నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్‌ సమావేశం గురువారం జరగనుంది.

మొక్కుబడి అజెండాతోనే ?!

నేడు తిరుపతి కార్పొరేషన్‌ కౌన్సిల్‌ తొలి భేటీ


తిరుపతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్‌ సమావేశం గురువారం జరగనుంది. మేయర్‌ డాక్టర్‌ శిరీష నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌ అఫిషియో సభ్యుడు, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్‌ సభ్యులుగా నలుగురిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. రెడ్డి, బలిజ, ముస్లిం, దళిత వర్గాలకు చెందిన నలుగురు పేర్లను ఇప్పటికే ఎమ్మెల్యే సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. తొలి కౌన్సిల్‌ సమావేశంలోని అజెండా అంశాలను పరిశీలిస్తే చాలా మొక్కుబడిగా ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, పైపులు, మోటార్ల మరమ్మతుల కోసం రూ.2.50కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. కార్పొరేషన్‌ సిబ్బంది వినియోగించే అద్దె వాహనాలకు ఏడాదికిగాను రూ.77లక్షలు మంజూరు కోరుతూ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. 2021-2022 సంవత్సరానికిగాను కార్పొరేషన్‌లో పనిచేసే 1365 మంది అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలకుగాను రూ.28కోట్లు అనుమతి తీసుకోనున్నారు. ఇక క్లాప్‌ కార్యక్రమం నిర్వహణపై అజెండాలో చర్చించనున్నారు. 


కనిపించని కరోనా ప్రస్తావన

తిరుపతిని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన నిధులు వంటి ప్రస్తావన అజెండాలో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కూరగాయల మార్కెట్ల వికేంద్రీకరణ, శానిటేషన్‌, మాస్క్‌పై అవగాహన వంటి అంశాలను కౌన్సిల్లో చర్చించాలని విపక్షాలు కోరుతున్నాయి. 


వేధిస్తున్న సమస్యలు

తిరుపతిలో యూడీఎస్‌ ఏర్పాటైన 20 ఏళ్లకే సమస్యలు మొదలయ్యాయి. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ కింద రూ.90 కోట్ల బడ్జెట్‌తో యూడీఎస్‌ను రీవాంప్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ కార్పొరేషన్‌ ఇదివరకే లేఖ రాసింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చిన్నపాటి వర్షానికే మ్యాన్‌హోల్స్‌ పొంగుతున్నాయి. భూగర్భంలో డ్రైనేజీ పైపుల లీకేజీ వల్ల, అవి మంచినీటి పైపుల్లో కలిసిపోయి కలుషిత నీరు సరఫరా అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రజారోగ్యం పెను ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా కార్పొరేషన్లో విలీనమైన పంచాయతీల్లో రోడ్లు సరిగ్గా లేవు. ఈ ఏడాది ఫిబ్రవరికి పూర్తికావాల్సిన గరుడ వారధి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. టీటీడీ నుంచి రావాల్సిన నిధుల వాటా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. వీటిపై కౌన్సిల్‌ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-04-22T06:32:13+05:30 IST