సగం ఫ్యాన్‌వైపే!

ABN , First Publish Date - 2021-05-03T06:02:26+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల్లో 2.71 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన వైసీపీకి నెల్లూరు జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో 57 శాతం ఓట్లు పడ్డాయి.

సగం ఫ్యాన్‌వైపే!
నెల్లూరులో డీకేడబ్ల్యూ కళాశాలలోని ఓ గదిలో కౌంటింగ్‌ అధికారుల హడావుడి

4 సెగ్మెంట్లలో వైసీపీకి 3,65,217 ఓట్లు

2019 కన్నా పెరిగిన బలం 1.5 శాతం 

తెలుగుదేశంకు 2,05,765 ఓట్లు

బీజేపీకి 29848 వేలు.. కాంగ్రె్‌సకు 4592వేలు


నెల్లూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికల్లో  2.71 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన వైసీపీకి నెల్లూరు జిల్లా పరిధిలోని నాలుగు  అసెంబ్లీ సెగ్మెంట్లలో 57 శాతం ఓట్లు పడ్డాయి. 2019 కన్నా కేవలం 1.5 శాతం ఓట్లే పెరిగాయి. టీడీపీకి 32 శాతం ఓట్లు దక్కాయి. బీజేపీకి 4.7 శాతం, కాంగ్రె్‌సకు 1.57 శాతం ఓట్లు పడ్డాయి.  దీంతో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకొని లెక్కకడితే వైసీపీకి అత్యధికంగా 57 శాతం ఓట్లు పడ్డాయి.  ఈ నియోజకవర్గాల పరిధిలో 6.36 లక్షల ఓట్లు పోల్‌ కాగా వైసీపీకి 3,65,217 ఓట్లు పడ్డాయి. ఇది జిల్లా పరిధిలో పోలైన మొత్తం ఓట్లలో 57 శాతంగా ఉంది.  టీడీపీకి 2,05,765 ఓట్లు (32 శాతం) పోల్‌ అయ్యాయి. బీజేపీకి 30,088 (4.7శాతం), కాంగ్రె్‌సకు 10,347 (1.57 శాతం) ఓట్లు దక్కాయి. 


వైసీపీ పెరిగిన బలం 1.5 శాతమే

2019 ఎన్నికలతో పోల్చితే వైసీపీ బలం పెద్దగా పెరగలేదు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో కేవలం 1.5 శాతం ఓట్లు మాత్రమే పెరిగాయి. 2019 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో 51.17 శాతం, గూడూరులో 54.25 శాతం, సూళ్లూరుపేటలో 61.10, వెంకటగిరిలో 56.02 శాతం ఓట్లను వైసీపీ కైవసం చేసుకుంది. సరాసరి 55.5 శాతం ఓట్లు వైసీపీకి దక్కాయి. అయితే ఈ ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో పోలైన మొత్తం ఓట్లలో 57 శాతం ఓట్లు పడ్డాయి. అంటే కేవలం 1.5 శాతం మాత్రమే. ఈ నాలుగు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు భారీ మెజారిటీ కోసం శక్తికి మించి శ్రమించారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల కన్నా తక్కువ ఓట్ల శాతానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఉదాహరణకు సూళ్లూరుపేటలో 2019లో వైసీపీకి 61.10 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 56.8 శాతం ఓట్లకు పరిమితం అయ్యింది. ఇక గూడూరులో వైసీపీకి 57.4 శాతం, టీడీపీకి 33.5, బీజేపీకి 4.3, కాంగ్రె్‌సకు .6 శాతం ఓట్లు దక్కాయి. సూళ్లూరుపేటలో వైసీపీకి 56.8 శాతం, టీడీపీకి 33.3, బీజేపీ 5.2, కాంగ్రె్‌సకు 0.9, వెంకటగిరిలో వైసీపీ 58.59, టీడీపీ 31.5, బీజేపీ4.8, కాంగ్రెస్‌ 0.9, సర్వేపల్లిలో వైసీపీకి 58.6, టీడీపీకి 32, బీజేపీకి 45, కాంగ్రె్‌సకు 0.5 శాతం ఓట్లు దక్కాయి. అధికార హోదాలో ఎన్నికలు నిర్వహించినా, రెండేళ్ల కాలంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేసినా, 2019 ఎన్నికల కన్నా కేవలం 1.5 శాతం పెరుగుదలకే పరిమితం కావడం గమనార్హం. 


ప్రశాంతంగా కౌంటింగ్‌

తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాతంగా జరిగింది. గత నెల 17న పోలింగ్‌ జరగగా ఆదివారం కౌంటింగ్‌ పూర్తయ్యింది. జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలకు సంబంధించి నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీలో కౌంటింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటలకు సర్వీసు ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించారు. అనంతరం స్ట్రాంగ్‌ రూంలను రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, జనరల్‌ అబ్జర్వర్‌ రామ్‌ప్రసాద్‌ సమక్షంలో తెరిచారు. అత్యధికంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో 25 రౌండ్లు, గూడూరు, వెంకటగిరిలో 23, సర్వేపల్లిలో 22 రౌండ్లలో కౌంటింగ్‌ జరిగింది. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ వేగంగా జరగ్గా, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో కొంత నెమ్మదిగా సాగింది. సాయంత్రం ఐదు గంటలకల్లా కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయింది. అనంతరం తిరుపతి ఎంపీగా గెలుపొందిన ఎం.గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిలతోపాటు వెళ్లి రిటర్నింగ్‌ అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు నుంచి డిక్లరేషన్‌ ఫాం అందుకున్నారు. వారి వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్‌ వచ్చారు. కాగా రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. తిరుపతిలో జరిగిన కౌంటింగ్‌ ఫలితాలను త్వరగా వెల్లడించగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఫలితాల కోసం మాత్రం చాలా సేపు ఎదురుచూడాల్సి వచ్చింది. అలానే తుది ఫలితాలను ప్రకటించడంలో కూడా జాప్యం జరిగింది. సాయంత్రం ఆరు గంటలకే గెలుపొందిన అభ్యర్థికి డిక్లరేషన్‌ ఇచ్చిన అధికారులు రాత్రి 8:30 గంటల వరకు తుది ఫలితాలను ప్రకటించలేదు. దీంతో అందరిలోనూ కొంత అయోమయం నెలకొంది. కాగా కౌంటింగ్‌ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించారు. 

 

గూడూరులో అసంతృప్తి సెగతో..

గూడూరురూరల్‌ : 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి మెజారిటీ తగ్గింది. 2019లో 2,36,496 ఓటర్లు ఉండగా, 1,84,602 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.  ఈ ఉప ఎన్నికల్లో  2,48,222 మంది ఓటర్లు ఉండగా, 1,58,389 మంది ఓటుహక్కును వినియోగించు కున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 46,381 మెజారిటీ రాగా, ప్రస్తుతం 37,740 మెజారిటీ వచ్చింది. దీంతో గత ఎన్నికలతో పోల్చితే 8,641 మెజారిటీ తగ్గింది. ఎమ్మెల్యే వరప్రసాద్‌పై అసంతృప్తి కారణంగా ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ తగ్గుదలకు కారణమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారాల్లో వాకాడు మండలం తూపిలిపాళెంలో ఎమ్మెల్యేపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చిట్టమూరు మండలం మల్లాం, చిట్టమూరులో ఎమ్మెల్యే సమక్షంలోనే వైసీపీలో వర్గపోరుతో వివాదాలు నెలకొన్నాయి. బురదగాలికొత్తపాళెంలో మౌలికవసతులు కల్పించలేదని ఎన్నికలను బహిష్కరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది.


సూళ్లూరుపేటలో తగ్గిన మెజారిటీ 

సూళ్లూరుపేట : సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆధిక్యత కనబరిచినా మెజారిటీ తగ్గింది.  2019 ఎన్నికలతో పోల్చితే ఈసారి 21 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కె.జయరామయ్య కంటే వైసీపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 14,862 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసీపీకి 51 శాతం, ఉమ్మడి అభ్యర్థికి 42.6శాతం ఓట్లు వచ్చాయి 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌కు 1,16,970 (61శాతం)  ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 57,276 (31.18 శాతం) ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 99,483 (41.33 శాతం) ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 56,120 (23.31 శాతం) ఓట్లు వచ్చాయి.  వైసీపీ 20 శాతం, టీడీపీ 8శాతం ఓట్లు కోల్పోయాయి. 


వెంకటగిరిలో వైసీపీ హవా

వెంకటగిరి : ఉప ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీకి 16,167 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 2019లో వైసీపీ అభ్యర్థికి 40366 ఓట్లురాగా, ప్రస్తుతం 40366 ఓట్లు వచ్చాయి. వెంకటగిరిలో 3863, రూరల్‌లో 2960, రాపూరులో 11200, సైదాపురంలో 5350, డక్కిలిలో 4360, బాలాయపల్లిలో 4750, కలువాయిలో 7883 ఓట్లు ఆధిక్యం వచ్చింది. అయితే ఈ ఓట్లు పెరగడానికి కారణం దొంగ ఓట్లేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  


పని చేసిన పథకాల భయం!!

ముత్తుకూరు : ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీడీపీ కొంత పుంజుకుంటుందని భావించారు. అయితే ప్రచారం చివరలో అధికార వైసీపీ ప్రదర్శించిన మాయాజాలం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వలంటీర్లతో ఇంటింటికి ముఖ్యమంత్రి పేరుతో ప్రచురించిన కరపత్రాల పంపిణీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. మీ కుటుంబానికి ఇన్ని పథకాలు వచ్చాయి. ఇంత లబ్ధి పొందారు, ఇప్పుడు వైసీపీకి ఓట్లు వేయకపోతే అన్ని కోల్పోవాల్సి వస్తుందన్నా వలంటీర్ల ప్రచారంతో మెజార్టీ ఊహించనంతగా పెరిగింది. దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నాయకులు వైసీపీలో చేరడం, ఉప ఎన్నికల పోలింగ్‌ రోజు వరకు నగదు పంపిణీ చేసేది లేదని మభ్యపెట్టి, ముందురోజు రాత్రి గ్రామాల్లో డబ్బులు పంచడం వైసీపీకి బాగా లాభించింది. టీడీపీ కేడర్‌లో ఉత్సాహం కనిపించినా వైసీపీ పథకాల భయం, నగదు పంపిణీల ముందు వారి ఎత్తులు పనిచేయలేదనే విశ్లేషణ వ్యక్తమవుతోంది.  ఈ ఉప ఎన్నికల్లో కేవలం నియోజకవర్గంలో 66.19 శాతం ఓట్లు పోలయ్యాయి. గత 2014లో 81శాతం ఓట్లు, 2019లో 82.42 శాతం ఓట్లు పోలయ్యాయి. అయినప్పటికీ ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి 40,895 ఓట్ల భారీ మెజార్టీ రావడం గమనార్హం.  

 

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

రిటర్నింగ్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు, మే 2 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా ముగిసిందని, సహకరించిన ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా, ఉద్యోగులకు రిటర్నింగ్‌ అధికారి కేవీఎన్‌ చక్రధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు కొవిడ్‌ విధులు నిర్వహిస్తూనే ఎన్నికలను పూర్తి చేశామని ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉప ఎన్నిక కౌంటింగ్‌ను 172 టేబుళ్లు ఏర్పాటు చేశామని, సుమారు వెయ్యి మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌, అక్కడి ఇద్దరు ఎస్పీలు, నెల్లూరు జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులమంతా సమన్వయంతో పని చేశామని పేర్కొన్నారు. కౌంటింగ్‌ పూర్తయినా మరో రెండు రోజుల పాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరూ కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని అన్నారు.  





Updated Date - 2021-05-03T06:02:26+05:30 IST