ఐదు లక్షలపై అలజడి!

ABN , First Publish Date - 2021-04-11T09:16:48+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్‌ గురుమూర్తికి 5 లక్షల ఓట్ల మెజారిటీ సాధించిపెట్టాలంటూ సీఎం జగన్‌ పెట్టుకున్న స్వీయ లక్ష్యం ఇప్పుడు

ఐదు లక్షలపై అలజడి!

‘తిరుపతి’ మెజారిటీపై తర్జనభర్జన

టీడీపీ సభలకు జనం వెల్లువతో అధికార వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన

మెజారిటీ లక్ష్యం చేజారుతుందన్న కలవరం

బీజేపీ, జనసేన, టీడీపీల నుంచి విమర్శల జోరు

 సీఎం జగన్‌లో సడలుతున్న ‘లక్ష్యం’ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్‌ గురుమూర్తికి 5 లక్షల ఓట్ల మెజారిటీ సాధించిపెట్టాలంటూ సీఎం జగన్‌ పెట్టుకున్న స్వీయ లక్ష్యం ఇప్పుడు ఆయన మెడకు గుదిబండగా మారిందా? ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసిన సమయానికి ఉన్న రాజకీయ వాతావరణం మారిపోయి.. అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయా? దీంతో లక్ష్య సాధన కష్టమనే భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. స్థానిక ఎన్నికల్లో 90% స్థానాలను దక్కించుకోవాలంటూ మంత్రులకు ఇచ్చిన ఆదేశాలు కార్యరూపం దాల్చిన తరహాలోనే.. తిరుపతిలోనూ 5 లక్షల మెజారిటీ సాధించాలంటూ మంత్రులు, పార్టీ నేతలకు జగన్‌ లక్ష్యం నిర్దేశించారు.


అంతేకాదు.. తిరుపతిలో 5 లక్షల మెజారిటీ సాధిస్తే దేశమంతా తిరుపతివైపే చూస్తుందని, అలా చూసేలా చేయాలని కూడా సీఎం పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ఆ లక్ష్య సాధన అధికార పార్టీకి తలకుమించిన భారంగా పరిణమిస్తోంది. స్థానిక ఎన్నికల్లో జిల్లా యంత్రాంగాన్ని అధికారపక్షానికి అనుకూలంగా మలుచుకున్నా.. తిరుపతి ఉప పోరులో మాత్రం ఈ తరహా పరిస్థితి లేదు. అధికార యంత్రాంగమంతా కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలో పనిచేస్తోంది. పైగా సీఎం జగన్‌ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీంతో భారీ మెజారిటీపై వైసీపీ తర్జనభర్జన పడుతోంది. 


మారిన రాజకీయ పరిణామం!

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడ్డ సమయంలో రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి రాజకీయపక్షాలు బయటపడలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్‌.. తిరుపతిలోనూ స్థానిక ఎన్నికల మాదిరిగా ఫలితం వస్తుందని లెక్కలు వేసుకున్నారు. కానీ, ఉప ఎన్నికకు రోజులు గడుస్తున్నకొద్దీ టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రచారజోరు పెంచాయి. జగన్‌ పాలనా వైఫల్యాలపై బీజేపీ, జనసేన సంయుక్తంగా విమర్శల దాడి చేస్తున్నాయి.


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్‌ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. జగన్‌ పాలన సహా ప్రత్యేక హోదా, వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ, పెరిగిన ధరలు, అవినీతి, ఇసుక తదితర అంశాలను లేవనెత్తుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే వైసీపీకి 28 మంది గొర్రెలు(ఎంపీలు) ఉన్నారని, ఇప్పుడు మరో గొర్రెను గెలిపించడం అవసరమా? అని టీడీపీ నుంచి విమర్శల జోరు మొదలైంది. దీంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో, ఎలా సమాధానం చెప్పాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. 


వైసీపీలో సమన్వయ లోపం!

తిరుపతి పార్లమెంటు పరిధిలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల మధ్య సమన్వయలేమి కూడా ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. భారీ ఎత్తున సభలు నిర్వహించాలని సీఎం జగన్‌ నుంచి ఆదేశాలు వచ్చినా.. గూడూరు తదితర నియోజకవర్గాల్లో మొక్కుబడిగానే సభలు పెడుతున్నారు. ఆయా సభలకు కూడా జనసమీకరణ చేయడంలో నేతలు విఫలమవుతున్నారు. దీంతో వైసీపీ సభలకు జనాలు లేక వెలవెలబోతున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే.. గతంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ నేతల సభలకు జనం పలుచగా ఉండేవారని.. ఇప్పుడు వారి హాజరు అనూహ్యంగా ఉందని వైసీపీ ముఖ్యనేతలే చెబుతున్నారు. ఇది కూడా వైసీపీ అధినేత జగన్‌ను ఆందోళనకు గురి చేస్తోందని సమాచారం.


సడలుతున్న ధీమా!

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఐదు లక్షల మెజారిటీ సాధించాల్సిందేనని పార్టీ అధినేత జగన్‌ తమను ఆదేశించారంటూ మంత్రులు ఇటీవల వరకు మీడియా సమావేశాల్లో చెప్పేవారు. అయితే.. వైసీపీ నిర్వహించిన స్వీయ సర్వేలు, పార్టీ అంతర్గత లెక్కలు చూస్తుంటే.. గెలుపు ఖాయమని చెబుతున్నారే తప్ప.. మెజారిటీపై ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. ఇప్పటికే మెజారిటీని ప్రకటించిన వైసీపీ అధినేతకు 5 లక్షల మెజారిటీ సాధించడం ‘సవాల్‌’గా మారిపోయింది.


టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల సభలకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండడం.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేయడం వంటివి 2019 సార్వత్రిక ఎన్నికల నాటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయం వైసీపీలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ నెల 14న సీఎం జగన్‌ స్వయంగా ప్రచారంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. కానీ.. ఇది కూడా రాజకీయంగా ప్రతికూలంగా మారింది. స్థానిక ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున్న ప్రజలను ఓట్లడగాలా అని మంత్రులను ప్రశ్నించిన జగన్‌.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తాననడం.. రాజకీయంగా వైసీపీని ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది. దీంతో.. ఈ నెల 14న తిరుపతిలో నిర్వహించదలచిన ప్రచార సభను కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో విరమించుకుంటున్నానని చెబుతూ జగన్‌ రద్దు చేసుకున్నారు. అయితే.. కరోనా వ్యాప్తి విషయంలో మంత్రుల పర్యటనలకు లేని అభ్యంతరం, ముఖ్యమంత్రి సభకేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో సీఎం జగన్‌ స్వీయ లక్ష్యం.. సాధిస్తేనే నైతికంగా గెలిచినట్లవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-04-11T09:16:48+05:30 IST