నల్లబియ్యం సాగులో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్ధి ఘనత

ABN , First Publish Date - 2021-05-06T23:27:50+05:30 IST

వ్యవసాయం లాభసాటి అని నిరూపించేందుకు, అన్నదాతల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి కౌటిల్య కృష్ణన్ ఎంతో కృషి చేస్తున్నారు. వేద వ్యవసాయ ప్రయోగాల ద్వారా..

నల్లబియ్యం సాగులో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్ధి ఘనత

తిరుపతి: వ్యవసాయం లాభసాటి అని నిరూపించేందుకు, అన్నదాతల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి కౌటిల్య కృష్ణన్ ఎంతో కృషి చేస్తున్నారు. వేద వ్యవసాయ ప్రయోగాల ద్వారా 2 ఎకరాల వ్యవసాయ భూమిలో 40 క్వింటాళ్ల నల్ల బియ్యం(కృష్ణ వ్రిహీ) పండించి ఘనత సాధించాడు. కౌటిల్యకృష్ణన్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలో ఉన్న తన 2 ఎకరాల పొలంలో ఈ సాగు చేశారు. ఆయన తిరుపతి విశ్వవిద్యాలయంలో ఎంఏ యజుర్వేదం అభ్యసిస్తున్నారు. అయితే కృషి భారతం వ్యవస్థాపకుడు కూడా అయిన కౌటిల్య కృష్ణన్.. కొన్నేళ్లుగా వేద వ్యవసాయ పద్ధతుల ద్వారా ఏ మాత్రం రసాయనాలు వాడకుండా సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయనకు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్ వీ మురళీధర్ శర్మ, వేదభాష్యం విభాగం తోడ్పాటు అందించారు.


ఈ మేరకు విశ్వవిద్యాలయం నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. అందులో.. కౌటిల్య కృష్ణన్‌ను ప్రశంసిస్తూ ఆయన అనుసరించిన విదానాలను వెల్లడించారు. యజుర్వేదంలో పేర్కొన్న వేద వ్యవసాయ పద్ధతిలో కౌటిల్యకృష్ణన్ కృష్ణ వ్రీహి పంటను సఫలీకృతం అయ్యారని, దీని కోసం పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మాలను, ఎరువుగా ఆవుపేడను వినియోగించారని ఆ ప్రకటనలో తెలిపారు. సుశృత సంహిత ఆధారంగా విత్తనం ఎంపికచేసి వృక్ష ఆయుర్వేదం, కృషి పరాశర గ్రంథం ఆధారంగా వేద వ్యవసాయ పద్ధతులను అనుసరించినట్లు వెల్లడిచింది. ఇది మన మహర్షులందించిన వ్యవసాయ విజ్ఞానపు ఫలితమే అని తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.


‘పోషకాహార విలువలు పుష్కలంగా ఉన్న కృష్ణవ్రీహీకి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. తన పంటల ద్వారా రైతుల్లో అవగాహన పెంచడంతో పాటు, వారిని ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉంచాలనే లక్ష్యంతో కౌటిల్య వేద వ్యవసాయ విధానాలను పాటిస్తున్నారు. ప్రకృతి హితకరంగా పండించిన ఇటువంటి ఆహారం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంపొంది శక్తిమంతమైన జాతిని రూపొందించుకోగలుగుతామ’ని ఆ ప్రకటనలో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పేర్కొంది.


Updated Date - 2021-05-06T23:27:50+05:30 IST