May 5 2021 @ 08:31AM

డీఎంకే హయాంలో సినీ సమస్యలకు పరిష్కారం: తిరుప్పూరు సుబ్రమణియం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకానున్న డీఎంకే ప్రభుత్వ హయాంలో చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తమిళనాడు సినిమా థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుప్పూరు సుబ్రమణియం ఆశా భావం వ్యక్తం చేశారు. ఇదేవిషయంపై ఆయన తిరుప్పూరులో మంగళవారం విలేకరులతో తిరుప్పూరు సుబ్రమణియం మాట్లాడుతూ ‘‘ముగిసిన ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్టాలిన్‌కు అభినందనలు.  సీఎంగా స్టాలిన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని సినిమా సంఘాలు కలిసి ఒక సన్మానం చేస్తాం. దీనికి స్టాలిన్‌ ఖచ్చితంగా హాజరు కావాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో దివంగత నేత కరుణానిధి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి సన్మాన కార్యక్రమానికి హాజరయ్యేవారు. అలాగే స్టాలిన్ కూడా హాజరవుతారని భావిస్తున్నాం. 

గతంలో డీఎంకే ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమకు ఎంతో మంచి చేశాయి. ముఖ్యంగా కరోనా కారణంగా థియేటర్లు యేడాదిగా మూతపడటంతో ఆస్థి పన్ను, వృత్తిపన్ను, విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలి. 8 శాతం ఎల్‌.బి.డి పన్నును పూర్తిగా రద్దు చేసినట్టయితే, సినిమా థియేటర్లలో టిక్కెట్ల ఽధరలు తగ్గుతాయి. అంతే కాకుండా, ఎమ్మెల్యేగా ఎన్నికైన హీరో ఉదయనిధి కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారేననీ, ఆయనకు సినీ ఇండస్ట్రీలోని కష్టనష్టాలు బాగా తెలుసు. అందువల్ల డీఎంకే ప్రభుత్వ హయాంలో చిత్ర పరిశ్రమ సమస్యలన్నీ పరిష్కారం అవు తాయన్న నమ్మకం ఉంది. ముఖ్యంగా చిత్రపరిశ్రమపట్ల కరుణానిధి ఎంతో ఉదార స్వభావంతో ఉండేవారు. అదే పంథాను ఆయన తనయుడు స్టాలిన్‌ అనుసరిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.