Jun 24 2021 @ 19:31PM

ఇళయదళపతి విజయ్‌ సినిమా పేర్లపై దుమారం

తమిళ చిత్ర పరిశ్రమలో ఆంగ్ల టైటిల్స్‌ సంస్కృతి మళ్ళీ ఊపందుకుంటోంది. ఈ విషయంలో ఇళయదళపతి ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు. ఈయన ఇటీవల కాలంలో తన చిత్రాలకు వరుసగా ఆంగ్ల టైటిల్స్‌నే పెడుతున్నారు. తన 65వ చిత్రానికి కూడా ‘బీస్ట్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే హీరో విజయ్‌ నటించిన ‘బిగిల్‌’, ‘మాస్టర్‌’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే, ఈ టైటిల్స్‌ కొంతమేరకు ప్రేక్షకుల మనస్సులను తాకాయి. కానీ, తాజాగా పెట్టిన్‌ ‘బీస్ట్‌’ టైటిల్‌ ఇపుడు విమర్శలకు దారితీసింది. 


తమిళ టైటిల్స్‌కు విజయ్‌ వ్యతిరేకమా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కోలీవుడ్‌ అగ్రహీరో విజయ్‌ తన చిత్రాలకు వరుసగా ఇంగ్లీష్‌ టైటిల్స్‌ పెట్టడాన్ని పలువురు రాజకీయ నేతలు, భాషా పండితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే తాజా టైటిల్‌ ‘బీస్ట్‌’పై వివాదం చెలరేగింది. ఇదిలా ఉండగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు సుమారుగా 110 చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కటంటే ఒక్క ఆంగ్ల టైటిల్‌  పెట్టకపోవడం గమనార్హం. ముఖ్యంగా 80లో అనేక చిత్రాలు విడుదలైనప్పటికీ... వాటన్నింటికి కూడా తమిళంలోనే టైటిల్స్‌ పెట్టారు. ఇదే విషయాన్ని తమిళ భాషాభిమానులు ప్రస్తావిస్తున్నారు. కానీ, విజయ్‌ వంటి స్టార్‌ హీరో తన చిత్రాలకు ఆంగ్ల టైటిల్స్‌నే ఖరారు చేయడంపై వీసీకే వంటి కొన్ని రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు.