కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీన ప్రచారాన్ని ఖండించిన కోదండరాం

ABN , First Publish Date - 2021-07-11T18:09:03+05:30 IST

కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత కోదండరాం తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీన ప్రచారాన్ని ఖండించిన కోదండరాం

హైదరాబాద్: కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత కోదండరాం తీవ్రంగా ఖండించారు. తెలంగాణ జనసమితిపై సోషల్ మీడియాలో అధికార పార్టీనే దుష్ప్రచారం చూపిస్తోందని ఆరోపించారు. అమరవీరుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని... అమ్ముడు కొనుడు రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయే రాజకీయాలు టీజేఎస్ చేయదని ఆయన తెలిపారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఆస్తుల సంపాదనే లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలను పైసలకు అడ్డాగా కేసీఆర్ మార్చారన్నారు. ఇకపై అన్ని ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం‌ కోసం అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జులు, పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు టీజేఎస్ అధినేత చెప్పారు. నిరుద్యోగ, రైతాంగ సమస్యలపై ఉద్యమం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చేతకాని తనం వలనే నాగర్ కర్నూల్ జిల్లాలో కొండల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కృష్ణా జలాలపై ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నుంచి రాజోలిబండ వరకు యాత్ర చేస్తామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని కోదండరాం డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-11T18:09:03+05:30 IST