శాసనమండలిలో అడుగు పెడ్తా: కోదండరాం

ABN , First Publish Date - 2021-03-09T20:34:20+05:30 IST

ఎమ్మెల్సీగా గెలిచి శాసనమండలిలో అడుగు పెడతానని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ధీమా వ్యక్తం చేశారు.

శాసనమండలిలో అడుగు పెడ్తా: కోదండరాం

హైదరాబాద్: ఎమ్మెల్సీగా గెలిచి శాసనమండలిలో అడుగు పెడతానని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం  కోదండరాం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాల్సిన పల్లా రాజేశ్వర్‌రెడ్డినే సొంత యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవటం దుర్మార్గమన్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులపై టీఆర్ఎస్ దాడి హేయమైన చర్య అన్నారు. ఉద్యోగాల ఖాళీల కంటే హైదరాబాద్ చుట్టుపక్కల భూముల సర్వే నంబర్ల గురించి మంత్రి కేటీఆర్‌కు బాగా తెలుసునని చెప్పారు.మిలియన్ మార్చ్‌కు  రేపటితో పదేళ్లు అని చెప్పారు. మిలియన్ మార్చ్ ను  ప్రభుత్వం కావాలనే గుర్తుచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దీక్ష చేసిన రోజును మాత్రమే టీఆర్ఎస్ గుర్తుచేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.


టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్నివర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయన్నారు. కేసీఆర్ నియంతృత్వంగా ప్రజల భాగస్వామ్యాన్ని రూపుమాపు చేస్తున్నాడని చెప్పారు. పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం ఉందన్నారు. అసమర్థ, నిరంకుశ పాలనను తరిమికొట్టాలని ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టభద్రులు మార్చి 14కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వం నగదును, మందు, పోల్ మేనేజ్‌మెంట్ మీద ఆధారపడిందని కోదండరాం పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-09T20:34:20+05:30 IST