గవర్నర్ ధన్‌కర్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో టీఎంసీ తీర్మానం?

ABN , First Publish Date - 2022-01-28T18:29:46+05:30 IST

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్, ముఖ్యమంత్రి మమత

గవర్నర్ ధన్‌కర్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో టీఎంసీ తీర్మానం?

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా రాజ్యసభలో ఓ సబ్‌స్టాంటివ్ మోషన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


గవర్నర్ ధన్‌కర్ ప్రతి రోజూ ఏదో ఒక వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎంసీ ఆగ్రహంతో ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ హక్కులలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ సీనియర్ ఎంపీ ఒకరు జాతీయ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రి మమత బెనర్జీ సమక్షంలో జరిగిన టీఎంసీ పార్లమెంటరీ పార్టీ వర్చువల్ సమావేశంలో జగ్‌దీప్ ధన్‌కర్‌ తీరుపై చర్చించారు. ఆయనపై బడ్జెట్ సెషన్‌లో రాజ్య సభలో సబ్‌స్టాంటివ్ మోషన్‌ను ప్రవేశపెట్టడం గురించి  రాజ్యసభ చీఫ్ విప్ సుఖేందు శేఖర్ రే చెప్పారు. సమాఖ్య నిర్మాణంపై దాడి జరుగుతున్న విషయాన్ని, ఐఏఎస్ కేడర్ రూల్స్ సవరణ ప్రతిపాదనలు సహా, రాష్ట్రాల హక్కులను లాక్కోవడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను  పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించారు. 


సభలో కాంగ్రెస్‌తో సమన్వయంతో వ్యవహరించడంపై ఈ సమావేశంలో చర్చించలేదని తెలిసింది. అయితే ఈ విషయంలో పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించవచ్చునని కొందరు ఎంపీలు చెప్తున్నారు. 


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 


Updated Date - 2022-01-28T18:29:46+05:30 IST