8 దశల్లో పోలింగ్ అనుచితం : టీఎంసీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-02-27T19:09:04+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది విడతలుగా జరపాలని ఎన్నికల కమిషన్..

8 దశల్లో పోలింగ్ అనుచితం : టీఎంసీ ఆగ్రహం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది విడతలుగా జరపాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనుచితమని పేర్కొంది. ఈసీ ఎన్నికల తేదీల ప్రకటనపై టీఎంసీ నేత సౌగత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్ ఎన్నికల విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం సమంజసంగా లేదని చెప్పారు. తమిళనాడు, కేరళలో ఒకే రోజు, అసోంలో 3 రోజులు ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు పశ్చిమబెంగాల్‌లో 8 దశల్లో పోలింగ్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతారని అన్నారు. నెలరోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిచిపోతాయని, అభివృద్ధి పనులు ఆగిపోతాయని చెప్పారు. 'ఇదంతా ఎన్నికల కమిషన్ ఎందుకు చేస్తోందో తెలియదు. కానీ మేము మాత్రం ఈ నిర్ణయంతో విభేదిస్తున్నాం'  అని ఆయన పేర్కొన్నారు.


పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో నిర్వహిస్తామని, మార్చి 27న తొలి విడత పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. బెంగాల్‌కు వివేక్ దుబే, ఎంకే దాస్‌లను పరిశీలకులుగా కూడా ఈసీ నియమించింది. ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వచ్చింది.


త్రిముఖ పోటీ..

కాగా, ఈసారి పశ్చిమబెంగాల్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఎంసీ, కాంగ్రెస్-వామపక్ష కూటమి, బీజేపీ-మిత్రపక్షాల కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. 294 అసెంబ్లీ స్థానాల్లో 200 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. కాంగ్రెస్-వామపక్షాల మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. పేరున్న మైనారిటీ నేత ఇబ్బాస్ సిద్ధిఖ్ ఏర్పాటు చేసిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తోనూ ఈ కూటమి సంప్రదింపులు జరుపుతోంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లు, వామపక్షాలు 33 సీట్లు గెలుచుకోగా, అధికార టీఎంసీ 211 సీట్లతో విజయకేతనం ఎగువవేసింది. బీజేపీ కేవలం 3 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి సవాలు విసిరింది.

Updated Date - 2021-02-27T19:09:04+05:30 IST