CAA రద్దుకు పట్టుబట్టే యోచనలో TMC

ABN , First Publish Date - 2021-11-21T17:58:11+05:30 IST

రైతుల పోరాట ఫలితంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

CAA రద్దుకు పట్టుబట్టే యోచనలో TMC

కోల్‌కతా : రైతుల పోరాట ఫలితంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగొచ్చి, మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పడంతో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి కొత్త ఉత్సాహం వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ల రద్దు కోసం పార్లమెంటులో పట్టుబట్టాలని యోచిస్తోంది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం బీజేపీ, ముస్లిం ఓట్ల కోసం టీఎంసీ వీటిని బాగా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. 


వచ్చే ఏడాది ప్రారంభంలో కొన్ని రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల సమయంలో హిందూ ఓట్లను సమీకరించడం కోసం సీఏఏకు బీజేపీ మద్దతుగా ప్రచారం చేసింది. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు టీఎంసీ ప్రచారం చేసింది. 


తాజా పరిణామాల నేపథ్యంలో సీఏఏ, ఎన్ఆర్‌సీలపై నిరసన కార్యక్రమాలను మళ్ళి నిర్వహించాలని టీఎంసీ అధిష్ఠానం భావిస్తోంది. ఢిల్లీలోని షహీన్‌బాగ్ నిరసనల తరహాలో నిరసనలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. గతంలో కోల్‌కతాలో నిరసన తెలిపినవారిని సమీకరించాలని టీఎంసీ కేడర్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. 


సీనియర్ టీఎంసీ నేత ఒకరు జాతీయ మీడియాతో మాట్లాడుతూ, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. రైతు ఉద్యమం విజయవంతమవడంతో సీఏఏ, ఎన్ఆర్‌సీలపై కూడా వీథుల్లోకి రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 


సాగు చట్టాల రద్దుపై మోదీ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే, సీఏఏను వ్యతిరేకించే కొందరు ఓ కార్యక్రమాన్ని కోల్‌కతాలో నిర్వహించారు. మరో విజయం సాధించడానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇటువంటి వర్గాలన్నిటినీ సమైక్యపరచాలని టీఎంసీ అధిష్ఠానం తన కేడర్‌కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ సీనియర్ నేత జాతీయ మీడియాకు చెప్పారు. 


Updated Date - 2021-11-21T17:58:11+05:30 IST