పెట్రో ధరల పెంపుపై టీఎంసీ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు

ABN , First Publish Date - 2021-07-10T20:07:28+05:30 IST

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ధర్నాలు

పెట్రో ధరల పెంపుపై టీఎంసీ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ధర్నాలు, నిరసనలు నిర్వహించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సామాన్యులకు ఇబ్బందికరంగా మారేవిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నారని, తక్షణమే ధరలను నియంత్రించాలని డిమాండ్ చేసింది. 


రాష్ట్రంలో లీటరు పెట్రోలు రిటెయిల్ ధర రూ.101ను తాకింది. లీటరు డీజిల్ ధర రూ.92కు చేరింది. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.861కి చేరింది. ఈ ధరలను తగ్గించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. కోల్‌కతా నగరంలోని డుం డుం, సెంట్రల్ ఎవెన్యూ, ఛేట్ల ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. 


రాష్ట్ర రవాణా మంత్రి ఫిర్హాద్ హకీం మాట్లాడుతూ, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులను పెంచిందని, అందుకే సామాన్యులకు అనేక కష్టాలు కలిగే విధంగా వీటి ధరలు పెరుగుతున్నాయని అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలకు నియంత్రణ లేకుండా పోయిందన్నారు. చమురు కంపెనీల షేర్ల ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని, లాభాపేక్షతో ధరలను పెంచుకునేందుకు ఆ కంపెనీలకు అవకాశం ఇస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలను విదేశీ పెట్టుబడిదారులకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిణామాలు దోహదపడతాయన్నారు. 


ఇదిలావుండగా, కాంగ్రెస్ కూడా పెరుగుతున్న పెట్రోలు ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ప్రజలపై భారం తగ్గడానికి వీలుగా పెట్రో ఉత్పత్తులపై పన్నులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తులపై పన్నుల తగ్గింపుపై మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం కూడా ఆలోచించాలన్నారు. 


పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, వీథుల్లోకి రావడం వల్ల పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గబోవన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు ఉంటాయన్నారు. 


Updated Date - 2021-07-10T20:07:28+05:30 IST