పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం

ABN , First Publish Date - 2021-11-02T22:26:06+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న బీజేపీకి ఉప ఎన్నికల్లోనూ

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న బీజేపీకి ఉప ఎన్నికల్లోనూ మరోమారు చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా జరిగిన నాలుగు స్థానల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయబావుటా ఎగరేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలోని ఖర్దాహా, శాంతిపూర్, గోసాబా, దిన్హటా శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్ చేసింది. 


అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన బీజేపీ ఉప ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి శాసనసభ ఎన్నికల ఫలితాల్లో చెలరేగిన హింసపై బీజేపీ నానా యాగీ చేసింది. ఉప ఎన్నికల్లోనూ దానిని గుర్తు చేసింది.


తృణమూల్‌కు అధికారం చిక్కడంతో రాష్ట్రంలో గూండాయిజం పెరిగిపోయిందని, టీఎంసీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. పనిలో పనిగా మమతను హిందూ వ్యతిరేకంగా ప్రచారం చేసింది. అయినప్పటికీ ఉప ఎన్నికల్లో బీజేపీ పాచిక పారలేదు. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీనే గెలిపించారు. 

 

మరోవైపు, అధికారికంగా ఫలితాలను ప్రకటించడానికి ముందే టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఘన విజయం సాధించినట్టు ప్రకటించారు. విజేతలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. విద్వేష రాజకీయాల కన్నా అభివృద్ధి, సమైక్యతలనే బెంగాల్ ఎల్లప్పుడూ ఎన్నుకుంటుందని పేర్కొన్నారు. ఉప ఎన్నిక విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు.  ప్రజల ఆశీర్వాదాలతో బెంగాల్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.  

Updated Date - 2021-11-02T22:26:06+05:30 IST