Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 20:26PM

కాంగ్రెస్ పిలిచే సమావేశాలకు టీఎంసీ డుమ్మా!

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరు కాకూడదని టీఎంసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక ఇటీవల టీఎంసీలో చేరిన గోవా నేతల ప్రభావం ఉంది. గోవాలో తాము కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతున్నందువల్ల కాంగ్రెస్ నిర్వహించే సమావేశాలకు హాజరుకారాదని టీఎంసీ పెద్దలను వారు కోరారు. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల టీఎంసీలో చేరిన గోవా నేతలు ఆ పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చారు. తాము రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతున్నందువల్ల కాంగ్రెస్ నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరు కాకూడదని చెప్పారు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశాల్లో పాల్గొనకూడదని టీఎంసీ నిర్ణయించింది. పార్లమెంటు లోపల ప్రతిపక్షాలతోపాటు కలిసికట్టుగా వ్యవహరించాలని, ఉదయంపూట జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశాల్లో కనిపించకూడదని టీఎంసీ నేతలు నిర్ణయించుకున్నారు. 


లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యత విజయవంతమైందని, శీతాకాల సమావేశాల్లో కూడా ఏకాభిప్రాయాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో టీఎంసీ పాల్గొనకపోతే, యూపీఏలో భాగస్వాములు కానటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ కూడా హాజరుకాకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


Advertisement
Advertisement