ఎన్నికల కమిషన్‌ను ఎండగడుతూ టీఎంసీ ఘాటు లేఖ

ABN , First Publish Date - 2021-04-15T00:49:39+05:30 IST

ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవహార శైలి అత్యంత దయనీయంగా ఉందని

ఎన్నికల కమిషన్‌ను ఎండగడుతూ టీఎంసీ ఘాటు లేఖ

కోల్‌కతా : ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవహార శైలి అత్యంత దయనీయంగా ఉందని, చట్టవిరుద్ధంగా పని చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. శాసన సభ ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదులపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఈ ఆరోపణలతో నేరుగా ఈసీకే ఓ లేఖను రాసింది. 


శాసన సభ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలపై టీఎంసీ, బీజేపీ చేస్తున్న ఫిర్యాదులపై ఈసీ తీసుకుంటున్న చర్యల్లో పక్షపాతం కనిపిస్తోందని ఆరోపించింది. ఈసీ పూర్తిగా విఫలమైందని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ఈసీ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరించవలసి ఉంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఈసీ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. 


ఈసీ చట్ట విరుద్ధ చర్యలపై పశ్చిమ బెంగాల్ ప్రజలు దీటుగా స్పందిస్తారని, తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తారనే నమ్మకం ఉందని టీఎంసీ పేర్కొంది. ఈసీ తన చర్యల్లో కాస్త న్యాయం కనిపించేలా చూసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఈసీ చర్యల్లో న్యాయం కనిపించడం లేదని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. 


Updated Date - 2021-04-15T00:49:39+05:30 IST