రోడ్డు పక్కన ప్రమాదకరంగా డ్రెయినేజీ గోతులు

ABN , First Publish Date - 2020-09-29T09:12:58+05:30 IST

జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లో రహదారుల పక్కన ప్రమాదకరంగా గొయ్యిలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల డ్రెయినేజీలపై మూతలు తొలగి ఇనుపచువ్వలు బయటపడి దర్శన మిస్తున్నాయి.

రోడ్డు పక్కన ప్రమాదకరంగా డ్రెయినేజీ గోతులు

ఏలూరు కార్పొరేషన్‌, సెప్టెంబరు 28 : జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లో రహదారుల పక్కన ప్రమాదకరంగా గొయ్యిలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల డ్రెయినేజీలపై మూతలు తొలగి ఇనుపచువ్వలు బయటపడి దర్శన మిస్తున్నాయి. మరికొన్ని చోట్ల డ్రెయిన్ల మీద మూత లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. వసంతమహల్‌ సెంటర్‌ నుంచి అంబికా థియేటర్‌కు వెళ్లే కెనాల్‌ రోడ్డులో రోడ్డు పక్కనే రెండు నెలల క్రితం గేట్‌వాల్‌ వద్ద పెద్ద గొయ్యితీసి వదిలి వేశారు. కనీసం ఆ గొయ్యికి నాలుగు వైపుల రక్షణ ఏర్పాటు చేయలేదు.


వసంతమహల్‌ నుంచి అగ్రహారం శివాలయానికి వెళ్లే మలుపులో డ్రెయినేజీపై మూత పగిలి ఇనుప ఊచలు బయటపడ్డాయి. అయినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గాంధీనగర్‌ కనకదుర్గమ్మ ఆలయ సెంటర్‌లో రోడ్డు పక్కనే  ప్రమాదకరంగా డ్రెయిన్‌ గొయ్యి దర్శన మి స్తోంది. అగ్రహారంలోని కాంగ్రెస్‌ ఆఫీస్‌ రోడ్డులో జాయింట్‌ డ్రెయిన్‌పై స్లాబ్‌ లేకపోవడంతో ఆదమరిస్తే ప్రమాదం బారిన పడడం ఖాయం. ఎటువంటి ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.   

Updated Date - 2020-09-29T09:12:58+05:30 IST