1,347 మందికి..!

ABN , First Publish Date - 2020-09-12T09:51:53+05:30 IST

సిద్దిపేట పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిజమైన నిరుపేదలకే కేటాయించిందని, పేదల కల ఇన్నేళ్లకు

1,347 మందికి..!

సిద్దిపేట మున్సిపల్‌ పరిధి పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

నర్సాపూర్‌ ఇళ్లను డ్రా పద్ధతిన కేటాయించిన అధికారులు

ఎవరి జోక్యం లేకుండానే ప్రక్రియ

కేసీఆర్‌, హరీశ్‌ పేరు చిరస్థాయిలో నిలుస్తుంది

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ఎంపిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌


సిద్దిపేట సిటీ, సెప్టెంబరు 11 : సిద్దిపేట పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిజమైన నిరుపేదలకే కేటాయించిందని, పేదల కల ఇన్నేళ్లకు నెరవేరిందని ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ఎంపికను డ్రా ద్వారా అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫారూఖ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ రాజకీయ జోక్యం లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందన్నారు. నిష్పక్షపాతంగా నర్సాపూర్‌లో డబుల్‌ బెడ్‌ రూంల ఇళ్లను నిరుపేదలకు కేటాయించామని తెలిపారు.


నిజమైన అర్హులకు ఇళ్లను కేటాయిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. నేడు ఇళ్లు రాని వారు బాధ పడొద్దని, గూడు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం మళ్లీ ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్ల ఎంపిక ప్రక్రియను రెండు బాక్స్‌ల ద్వారా చేపట్టామన్నారు. ఒక బాక్స్‌లో లబ్ధిదారుల దరఖాస్తు ఫారం, మరో బాక్స్‌లో ఇంటి నంబర్‌ చీటీలు వేసి డ్రా పద్ధతిన తీశామని తెలిపారు. దరఖాస్తు ఫారానికి వచ్చిన నంబర్‌ గల ఇంటిని, అదే దరఖాస్తుదారుడికి కేటాయించినట్లు వివరించారు.


డ్రా ద్వారా ఇళ్ల కేటాయింపు

1,347 దరఖాస్తు ఫారాలను బాక్స్‌లో వేసి డ్రా పద్ధతిన దరఖాస్తులను తీసి ఒక్కొక్కటిగా ప్రజలకు చూపిస్తూ ఇళ్ల నంబర్లను ఇచ్చారు. ఇలా ఎంపిక అయిన దరఖాస్తులో మొదటగా అదనపు కలెక్టర్‌, ఒక జిల్లా అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ సంతకాలు చేసి, అనంతరం ఇద్దరు ప్రధానోపాధ్యాయులను న్యాయనిర్ణేతలుగా నిర్ణయించి వారిచే కూడా సంతకం చేయించారు. లబ్ధి దారుడి పేరు, ఇంటి నంబర్‌ను ఒక రిజిష్టర్‌లో నమోదు చేశారు. అనంతరం ఆ వివరాలను కంప్యూటర్‌లో కూడా నమోదు చేశారు. దరఖాస్తు ఫారం జిరాక్స్‌ ప్రతిని లబ్ధిదారుడికి, ఒరిజినల్‌ను అధికారుల వద్ద ఉంచుకున్నారు.


113 బ్లాకుల్లో 1,347 మంది లబ్ధిదారుల ఎంపిక

నర్సాపూర్‌లో 113 బ్లాకుల్లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను 1,347 మందికి కేటాయించారు. కాగా మొత్తంగా 1,430 మంది తుది జాబితాకు ఎంపిక కాగా ఇందులో 83 మంది ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు బ్లాక్‌లోని కింది ఇళ్లను నేరుగా కేటాయించారు. ఈ ప్రక్రియలో దాదాపు వంద మంది ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


అనర్హులకు సరైన వివరణ ఇవ్వలేదంటూ కౌన్సిలర్ల అసంతృప్తి

సిద్దిపేటలోని నర్సాపూర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేదని, కానీ అనర్హులకు ఎందుకు ఇల్లు రాలేదో సరైన వివరణ ఇవ్వకుండా డ్రా తీయడం సరి కాదని సిద్దిపేట కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు న్యాయంగా సర్వే చేసినప్పటికీ అనర్హులకు ఎందుకు రాలేదో వివరణ ఇస్తామని అధికారులు చెప్పారని, వారి గురించి పట్టించుకోకుండా డ్రా తీశారన్నారు. దీంతో స్థానికంగా ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నదని వాపోయారు.


అంతేకాకుండా కొందరు అర్హులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కొందరి దరఖాస్తులను ఆపి, వారి దరఖాస్తును విచారణ చేయకుండా ఇళ్ల నంబర్‌ను కేటాయించడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌ను కౌన్సిలర్లు కోరగా, నిజమైన లబ్ధిదారుల విషయంలో కలెక్టర్‌తో మాట్లాడి త్వరలోనే విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.


హరీశ్‌రావు దయతోనే ఇల్లు వచ్చింది

సిద్దిపేట ప్రజలకు హరీశ్‌రావు ఎప్పుడు అండగా ఉంటారు. ఆయన కృషి తోనే ఇవాళ మాకు ఇల్లు వచ్చింది. మేము 30 ఏళ్లుగా కిరాయికి ఉంటున్నాం. ఇన్నేళ్ల మా కల హరీశ్‌రావు సారూ దయ వల్ల ఇవాళ్ల తీరింది. సారుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. 

-శారద, 30వ వార్డు 


చాలా సంతోషంగా ఉంది

చాలా కాలంగా మాకు ఇల్లు లేక నానా అవస్థలు పడ్డాం. ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండి నిజమైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడం సంతోషంగా ఉంది. నేను ఒంటరి మహిళను. నాకు కుమార్తె, కొడుకు ఉన్నారు. ఇన్నేళ్లుగా ఇంటి అద్దె కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇన్ని రోజులకు నా సొంతింటి కల ప్రభుత్వం ద్వారా ఫలించింది.

- లలిత, 19 వార్డు

Updated Date - 2020-09-12T09:51:53+05:30 IST