ప్రియురాలికి ఖరీదైన బహుమతి కొనేందుకు ముగ్గురు యువకులు ఏం చేశారంటే...

ABN , First Publish Date - 2021-12-18T14:51:09+05:30 IST

ప్రియురాలికి ఖరీదైన బహుమతి కొనేందుకు ముగ్గురు యువకులు ఓ ఇంట్లో దోపిడీ చేసిన ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది.

ప్రియురాలికి ఖరీదైన బహుమతి కొనేందుకు ముగ్గురు యువకులు ఏం చేశారంటే...

న్యూఢిల్లీ : ప్రియురాలికి ఖరీదైన బహుమతి కొనేందుకు ముగ్గురు యువకులు ఓ ఇంట్లో దోపిడీ చేసిన ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని ఆర్కేపురం నివాసి శుభం(20)నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన ఆసిఫ్(19), జామియానగర్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ముల్లా(41) లు గతంలో జైలు జీవితం గడిపారు. జైలులో గడిపినపుడు ఈ ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడింది. ఇందులో ఓ యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. యువకుడు జైలు నుంచి బయటకు వచ్చాక ప్రియురాలికి ఖరీదైన బహుమతి ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని భావించాడు. బహుమతి కొనడానికి తన ఇద్దరు స్నేహితుల సహకారంతో దోపిడీ చేయాలని ప్లాన్ వేశాడు. ముగ్గురు కలిసి ఢిల్లీలోని సరోజిని నగర్ ప్రాంతానికి చెందిన ఆదిత్య కుమార్ ఇంట్లో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కాలింగ్ బెల్ మోగించారు. 


కుమార్ తలుపు తీయగానే పిస్టల్ చూపిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కొట్టి బంధించారు.అనంతరం ఇంట్లో ఉన్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, బట్టలు ఉన్న బ్యాగ్, జాకెట్, షూ, చేతిగడియారం, స్కూటరును దోచుకెళ్లారు. కుమార్ కట్లు విప్పుకొని బంధువులు, పోలీసులకు సమాచారం అందించాడు.బాధితుడు కుమార్ మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నాడు.నేరస్థులను గుర్తించేందుకు ప్రత్యేక బృందం నిఘా సీసీటీవీ ఫుటేజీని సేకరించేందుకు ప్రయత్నించగా, పరిసరాల్లో కెమెరాలు లేవని పోలీసులు తెలిపారు.విచారణలో నేరస్థులు తమలో ఒకరిని శుభం అని పిలిచారని బాధితుడు కుమార్ పోలీసులకు చెప్పాడు. అనంతరం శుభం అనే పేరుతో 150 మంది నేరగాళ్ల డోసీయర్లను తనిఖీ చేసి నిందితులను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు.


శుక్రవారం సరోజినీ నగర్ ప్రాంతంలో దోపిడీకి గురైన స్కూటర్‌ను నడుపుతున్న శుభమ్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను పోలీసులు పట్టుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ శర్మ తెలిపారు.శుభం గతంలో రెండు కేసుల్లో, ఆసిఫ్ మూడు కేసుల్లో, ముల్లా మూడు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల వద్ద నుంచి రెండు స్కూటర్లు, ఒక ల్యాప్‌టాప్, చోరీకి గురైన నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బ్యాగ్‌తో పాటు బట్టలు, షూలు, ఒక చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.





Updated Date - 2021-12-18T14:51:09+05:30 IST