తొందరగా నిద్రపుచ్చేందుకు!

ABN , First Publish Date - 2021-01-04T05:30:00+05:30 IST

పిల్లలు ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోయేలా, ఉదయాన్నే ఒకే సమయానికి లేచేలా చూడాలి. దాంతో వారు చక్కగా నిద్రపోతారు.

తొందరగా నిద్రపుచ్చేందుకు!

‌కొందరు పిల్లలు రాత్రి పది దాటినా కూడా స్మార్ట్‌ఫోన్‌, టీవీ చూస్తూ ఉంటారు. ఆలస్యంగా పడుకోవడం వల్ల తొందరగా నిద్రపట్టదు. దాంతో ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారు. పిల్లలను సమయానికి నిద్రపుచ్చేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే...


    1.  పిల్లలు ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోయేలా, ఉదయాన్నే ఒకే సమయానికి లేచేలా చూడాలి. దాంతో వారు చక్కగా నిద్రపోతారు. ఫలితంగా వారి మెదడు చురకుగా పనిచేస్తుంది. 
    2.  నిద్ర వచ్చేంత వరకు పిల్లలు టీవీ చూస్తూనో లేదంటే స్మార్ట్‌ఫోన్‌ చూస్తూనో గడిపేస్తుంటారు. దాంతో ఆలస్యంగా నిద్రపోతుంటారు. అలాకాకుండా తల్లిదండ్రులు వారికి కథల పుస్తకాలు చదివి వినిపించాలి. కథలు వింటున్నప్పుడు పిల్లల ఊహాశక్తి పెరుగుతుంది. కథ వింటూ వింటూ వాళ్లు నిద్రలోకి జారుకుంటారు.
    3.  గది వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి. పిల్లలు నిద్రపోతున్నప్పుడు టీవీ వాల్యూమ్‌ చిన్నగా పెట్టాలి. అప్పుడు వారికి తొందరగా నిద్రపడుతుంది. 
    4.  పిల్లలు రాత్రి చక్కగా నిద్రపోవాలంటే వారి చిన్ని బుర్రలో ఏ భయాలు లేకుండా చూడాలి. అందుకోసం తల్లిదండ్రులు వారితో సరదాగా గడపాలి. వారి భయాలను తెలుసుకొని వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలి. 
    5.  నిద్ర సమయానికి ముందు పిల్లలకు చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వొద్దు. జంక్‌ఫుడ్‌ వంటివి తినిపిస్తే నిద్ర పట్టడం ఆలస్యమవుతుంది. 
    6.  అలానే పిల్లలకు ఏదైనా ఇస్తాం అంటే ఉత్సాహంగా చెప్పిన మాట వింటారు. తొందరగా నిద్రపోతే నీకు అవసరమైనది కొనిస్తాం! అని చెప్పారనుకోండి వాళ్లు వెంటనే నిద్రపోతారు. 

Updated Date - 2021-01-04T05:30:00+05:30 IST