Abn logo
Feb 23 2021 @ 02:58AM

పీవీ కుటుంబాన్ని అవమానించేందుకే!

ఓడిపోయే సీటులో వాణీదేవి పోటీ

పీవీపై ప్రేమ ఉంటే రాజ్యసభ సీటివ్వాలి: రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పీవీ నరసింహారావుపై అభిమానంతో కాదని, ఆ కుటుంబాన్ని అవమానించేందుకే సీఎం కేసీఆర్‌ సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయే సీటులో పోటీ చేయిస్తున్నారని, సీఎం కుట్రను తెలుసుకొని వాణీదేవి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి తరపున ఆయన నాలుగో సెట్‌ నామినేషన్‌ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దివంగత ప్రధానిపై అభిమానం ఉంటే.. నామినేటెడ్‌ ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఆ కుటుంబానికి ఇవ్వాలని, కానీ, 100 శాతం ఓడిపోయే స్థానంలో పోటీ ఏమిటని ప్రశ్నించారు. సర్పంచ్‌ నుంచి ప్రధాన మంత్రి స్థాయి వరకు పీవీకి తగిన గుర్తింపునిచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. విజయాలను తన ఖాతాలో వేసుకునే అలవాటున్న కేసీఆర్‌.. ఎమ్మెల్సీ ఓటమికి పీవీ కుటుంబాన్ని బాధ్యులను చేసే కుట్ర పన్నాడన్నారు. దమ్ముంటే కేసీఆర్‌ కుటుంబంలో ఒకరిని బరిలో నిలపాలని సవాల్‌ విసిరారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మొదట ప్రారంభించింది చిన్నారెడ్డి అని, 40 మంది ఎమ్మెల్యేలతో వనపర్తిలో బహిరంగ సభ నిర్వహించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఏడాదికి కేసీఆర్‌ పార్టీ పెట్టారన్నారు. అంతకుముందు గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో  ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను రూపొందించారు. 


పీవీ కుటుంబాన్ని మోసం చేసేందుకే..

ఓడిపోయే స్థానంలో మా చిన్నమ్మ (వాణీదేవి)ను పోటీ చేయించి మహా మనిషి పీవీ కుటుంబాన్ని కేసీఆర్‌ మోసం చేస్తున్నారని పీవీ మనవడు ఎన్‌వీ సుభాష్‌ విమర్శించారు. కేసీఆర్‌ది కుటిల రాజకీయమని,  బ్రాహ్మణ ఓట్లు చీల్చే కుట్రలో భాగమే వాణీదేవిని బరిలో నిలపడమని అన్నారు. పీవీపై అంత ప్రేమ ఉంటే పట్టభద్రుల ఎన్నికల్లో ఎంఐఎం సహకారం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement