Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండు నెలల్లో సాధారణ స్థితికి....

సామర్థ్యానికి మించి వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది... 

బాధల్లో అందరికీ అండగా ఉంటా

ఇల్లు కూలిన ప్రతి ఒక్కరికీ 5 సెంట్ల స్థలం, పక్కా గృహం

చెయ్యేరు తీర గ్రామాల్లో రక్షణ గోడల నిర్మాణం 

అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల నిర్మాణాలకు రీడిజైన

పది రోజుల్లో జాబ్‌ మేళా, ఉద్యోగ అవకాశాలు 

పొదుపు రుణాలపై త్వరలో స్పష్టత ఇస్తా 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన 

పులపత్తూరు, మందపల్లె గ్రామాల్లో బాధితులను పరామర్శించిన జగన

రాజంపేట / రాజంపేట టౌన / కడప, నవంబరు2(ఆంధ్రజ్యోతి): ‘‘అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయి ఉధృత వరదకు పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, రామచంద్రాపురం, గుండ్లూరు, పాటూరు గ్రామాల్లో ఊహించని నష్టం జరిగింది. బాధితులకు అండగా ఉంటా. రెండు నెలల్లో సాధారణ స్థితికి తీసుకొస్తా.. ధైర్యంగా ఉండండి..’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన భరోసా ఇచ్చారు. బాధితులను కలిసి పరామర్శించారు. 

గురువారం రాజంపేట మండలం పులపత్తూరు, మందపల్లె గ్రామాల్లో సీఎం జగన పర్యటించారు. షెడ్యూలు కన్నా గంట ఆలస్యంగా పులపత్తూరుకు చేరుకున్న సీఎం జగన ముందుగా ఫొటో గ్యాలరీని సందర్శించి వరద తీవ్రత చిత్రాలను పరిశీలించారు. అక్కడి నుంచి రాజుల వీధి, దళితవాడ వీధుల్లో వరదకు చితికిన ఇళ్లను, వీధులను పరిశీలించారు. బాధితులను పలకరించి ఓదార్చారు. దాదాపు 3గంటలకు పైగా పులపత్తూరులోనే సీఎం జగన గడిపారు. పలువురు మహిళలు, బాధితులు, కుటుంబ సభ్యులను కోల్పోయిన అభాగ్యులు జగనను కలిసి భోరున విలపించారు. శాశ్వత పరిష్కారం చూపాలంటూ విన్నవించారు. సీఎం వీటన్నింటిపట్ల సానుకూలంగా స్పందించారు.


రెండు నెలల్లో సాధారణ స్థితికి తీసుకొస్తా

పులపత్తూరు సచివాలయం దగ్గర బాధితులనుద్దేశించి సీఎం మాట్లాడారు. ఇప్పటికే 99 శాతం సహాయక చర్యలు పూర్తి చేశామని, ఇంకా ఎవరికైనా అందకపోతే సోషిల్‌ ఆడిట్‌ ద్వారా అందరికీ సహాయం చేస్తామన్నారు. పులపత్తూరులో 293 ఇళ్లు కుప్పకూలిపోయాయని, సురక్షిత ప్రాంతాల్లో 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మిగిలిన 6 గ్రామాల్లో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. వరద ఉధృతికి పొలాల్లో ఇసుక మేటలు వేశాయని సమగ్ర సర్వే చేసి ఇసుక మేటలను తొలగించేందుకు హెక్టారుకు 12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. భూ హక్కు పత్రాలు లేకపోయినా... ఈ-క్రాప్‌ నమోదు చేసింటే చాలు అందరికీ పరిహారం అందిస్తామన్నారు. తాను ఇంటింటికి వెళ్లినప్పుడు డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని అక్క చెల్లెల్లు కోరారని త్వరలోనే అధికారులతో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పారు.


వరద గ్రామాల్లో రక్షణ గోడలు

పులపత్తూరు నుంచి నందలూరు బ్రిడ్జి వరకు చెయ్యేరు ఇరువైపులా నదీ తీరంలో వరద ముంపు గ్రామాల్లో రక్షణ గోడ నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాకుండా వరదకు ఆటోలు, బైకులు కోల్పోయారని వాటి నెంబర్ల ఆధారంగా న్యాయం చేస్తామని వివరించారు. అధికారులు పది రోజులు ఈ గ్రామాల్లోనే ఉంటూ అన్ని సహాయక చర్యలు పూర్తి చేస్తారన్నారు. 


అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులకు రీడిజైన

చెయ్యేరు నదికి ఊహించని వరద వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులే... 3.25లక్షల క్యూసెక్కుల నీరు రావడంతోనే ప్రాజెక్టు తెగిపోయిందని సీఎం వివరించారు. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులను పునర్‌నిర్మాణం కోసం రీడిజైన చేయిస్తామన్నారు. 10-13 రోజుల్లోనే సహాయక చర్యలు అందించిన కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు.


మందపల్లెలో పది నిమిషాలే..

పులపత్తూరులో దాదాపు 3గంటలకు పైగా వరద ముంచిన వీధివీధిని తిరిగి బాధితులను పరామర్శించిన సీఎం జగన మందపల్లెలో కేవలం 10 నిమిషాల్లోనే పర్యటన ముగించారు. షెడ్యూలు ప్రకారం 12.25 గంటలకు మందపల్లెకు రావాల్సి ఉంది. అయితే 3.15 గంటలకు సీఎం వచ్చారు. సీఎం ఊరిలోకి రాగానే నేరుగానే తల్లి, భార్యను కోల్పోయిన వైసీపీ నాయకుడు ఈశ్వరయ్య ఇంటికి వెళ్లారు. ఆయన కూడా వరదకు తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతుండగా సీఎం వస్తున్నారని ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికే 9మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి రామ్మూర్తి, మల్లికార్జున కుటుంబ సభ్యులను పిలిపించి జగన ఓదార్చారు. మీకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి దిగువ మందపల్లెకు చేరుకొని సచివాలయం వద్ద బాధితులతో మాట్లాడి వెళ్లిపోయారు. మొత్తంగా పది నిమిషాల్లోపే జగన పర్యటన ముగిసింది. సీఎం పర్యటనలో జిల్లా ఇనచార్జి మంత్రి ఆదిమూలపు సురేశ, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, జడ్పీ చైర్మన ఆకేపాటి అమర్‌నాఽథరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంతరెడ్డి, ఎంపీ మిథునరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, సాయికాంతవర్మ, రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతనగార్గ్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం రాక సందర్భంగా ఎస్పీ కేకే అన్బురాజన ఆధ్వర్యంలో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఆదుకున్న యువతకు సీఎం అభినందనలు

పులపుత్తూరు గ్రామంలో వరద నుంచి పలువురి ప్రాణాలు కాపాడిన యువతను సీఎం జగన అభినందించారు. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోగానే ఉప్పెనై వరద ఎలా ముంచేసిందో గంధం శివప్రసాద్‌ సీఎంకు వివరించారు. ‘‘తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో ఇంట్లోనే వరదకు చిక్కుకున్నాం.. 6-9 నిమిషాలలో పూర్తిగా నీటిలో మునిగిపోయాం.. ఆ తరువాత నీటి మట్టం తగ్గాక ఏడుగురు బతికాం. ఇద్దరు నీటిలో ఊపిరి ఆడక మా కళ్లముందే కన్నుమూశారు’’ అని సీఎంకు వివరించారు. ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయినా.. గ్రామం మొత్తం అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించి వందల మంది ప్రాణాలు కాపాడిన గ్రామ సర్పంచి కుమారుడు భీము జగనమోహనరెడ్డిని సీఎం జగన అభినందించారు.


ఇదేం పర్యటన...

రాత్రి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కర్ఫ్యూ వాతావరణం

మందపల్లెలో టీడీపీ నేత కొండా శ్రీనివాసులు అరెస్టు

ఇంటింటికి వస్తాడని ఎదురు చూసిన వారికి నిరాశే

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించి తమను అన్ని విధాలా ఆదుకుంటారని అనుకున్న వారికి నిరాశే ఎదురైంది. పులపత్తూరు తరువాత అతి ఎక్కువగా దెబ్బతిన్న తొగూరుపేట, రామచంద్రాపురం, సాలిపేట, అన్నయ్యగారిపల్లె, పాటూరు, గుండ్లూరు గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. సరికదా... ఎగువ మందపల్లె గ్రామాన్ని మధ్యాహ్నం 12.20 గంటలకు సీఎం సందర్శిస్తారని అధికారిక ప్రకటన విడుదల చేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఉన్న సుమారు 150 కుటుంబాల వారికి త్రీడీ సినిమా కనబడినట్లైంది. బుధవారం రాత్రే పోలీసులు ఇంటింటికి వెళ్లి సీఎం కార్యక్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదైనా ఇబ్బంది పెడతారేమోనని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక ప్రధానంగా సీఎం వచ్చే సమయంలో మందపల్లె ప్రధాన వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వారి వారి ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వకుండా రాత్రి నుంచే కట్టడి చేశారు. మధ్యాహ్నం భోజనానికి కూడా ఆంక్షలు విధించారు. సీఎం కార్యక్రమం ముగిసిన తర్వాతే భద్రతా కారణాల దృష్ట్యా భోజనాలు పెడతామని అధికారులు తెలపడంతో చిన్న పిల్లలు, వృద్ధులు, బాధితులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై బాధితుల తరపున మీడియా ప్రశ్నించడంతో ఆ తరువాత భోజనాలు పెట్టారు. గ్రామస్థులు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీఎం వచ్చి వెళ్లినంత వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో టీడీపీ నాయకుడు కొండా శ్రీనివాసులును డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకొని ముందుగా నందలూరు పోలీ్‌సస్టేషనకు తరలించి ఆ తరువాత సిద్దవటం పోలీ్‌సస్టేషనలో ఉంచారు. ఆయన ఇంటి ముందు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లను అడ్డు పెట్టి, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు అక్కడే మకాం వేసి వారి కుటుంబీకులను నిర్బంధించారు.

ఇంటింటికి వచ్చి తమ గోడు వింటాడని, తమ నష్టాలు తెలుసుకుంటా, కష్టాలు వింటాడని, తమ సమస్యలు పరిష్కరిస్తాడని, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారని అనుకున్నారు. బాధితులతో మాట్లాడటానికి ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసినా ఆవైపు కన్నెత్తి చూడలేదు. 9 మంది చనిపోయిన పూజారి కుటుంబం ఇంటికి వెళతారని అందరూ ఊహించినా వెళ్లలేదు. ఆ గ్రామంలోనే తల్లిని, భార్యను పోగొట్టుకున్న ఈశ్వరయ్య కుటుంబీకులను, అక్కడికే తీసుకువచ్చిన పూజారి కుటుంబీకులను పరామర్శించారు. వారి కుటుంబంలో ఉద్యోగాలను, పక్కాగృహాలను ప్రభుత్వం తరపున సాయాన్ని అందిస్తామని చెప్పారు. పది నిమిషాల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరినీ పలకరించకుండా తిరిగి వెళ్లిపోవడంతో గ్రామస్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సీఎం వెళ్లిన వెంటనే గ్రామస్థులు వారి వారి వీధుల్లో చేరి ఇదేనా సీఎం కార్యక్రమం అంటే.. లక్షలు ఖర్చు పెట్టి, హడావుడి చేసి కనీసం మమ్మల్ను పరామర్శించకుండా వెళ్లిపోవడం న్యాయమా అంటూ ఆవేదన చెందారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మా గ్రామంలో 3గంటలకు పైగా పర్యటిస్తే ముఖ్యమంత్రి జగన కేవలం 10 నిమిషాల్లో ముగించారని, మా బాధలు కనీసం ఆలకించలేదని అలాంటప్పుడు ఈ గ్రామానికి ఎందుకొచ్చారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడం కొసమెరుపు. సీఎం పది నిమిషాల్లో తిరిగి వెళ్లిన తరువాత గ్రామ ప్రజల అసంతృప్తిపై ఆంధ్రజ్యోతి అభిప్రాయ సేకరణ. 


ఇల్లే కూరుకుపోతే మమ్మల్ని పరామర్శించరా...?

- తిరుమలశెట్టి వెంకటసుబ్బయ్య, ఈశ్వరయ్య, ఎగువ మందపల్లె 

లక్షలతో కట్టుకున్న మా ఇల్లు వరదల్లో పాడై ఇసుకలో కూరుకుపోయింది. మా ఇంటికి  సీఎం వస్తాడని అధికారులు చెబితే పొద్దుట్నుంచి పడిగాపులు కాశాం. మా భార్య, బిడ్డలతో పాటు మొత్తం ఇంటిల్లిపాది సీఎం కోసం ఎదురు చూశాం. తీరా ఊర్లోకొచ్చి తిరిగి అట్టే పోయినాడు. మమ్మల్ని ఆదరించేది ఇలాగేనా.? ఇదేనా సీఎం పర్యటన అంటే.. 


సీఎం వస్తాడు.. వస్తాడని

- కొండా అరుణ, ఎగువ మందపల్లె 

సీఎం వస్తాడు.. వస్తాడని ఆశగా ఎదురుచూశాం. మేమంతా పోగొట్టుకున్నాం. కట్టుబట్టలతో ఉన్నాం. సీఎం వస్తాడని, మా బాధలు తీరుస్తాడని అనుకుంటే మా వైపు కూడా చూడకుండా వెళ్లిపోయాడు. ఇదేందయ్యా.. సామీ.... ! ఇట్టా ముఖ్యమంత్రి ప్రోగ్రాం.. మేమెప్పుడూ చూడ్లా.... 


అట్టొచ్చి అట్టే పోయినాడు..

- కె.లక్ష్మీదేవి, ఎగువ మందపల్లె 

రెండు రోజుల నుంచి మీ వీధిలోకొస్తాడు.. మీ ఇంటికొస్తాడు, మీ బాధలు తీరుస్తాడని అందరికీ తీపి కబురు చెప్పి తీరా చూస్తే అట్టొచ్చి అట్టే పోయినాడు.. ఈ విధంగా ఎవరైనా చేస్తారా... ఏమన్నా న్యాయమా.. ఇట్లా చేస్తారని తెలిస్తే ముందే ఊరి నుంచి బయటకు వెళ్లిపోయేవాళ్లం కదా..


చంద్రబాబు మూడు గంటలుంటే జగన పది నిమిషాలేనా..

- పసల ప్రభాకర్‌, ఎగువ మందపల్లె 

మా ఊర్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు గంటలు పర్యటించి మమ్మల్ని ఓదార్చారు. పార్టీ తరపున ఆర్థిక సహాయం చేస్తానన్నాడు. అదే ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి పది నిమిషాలు కూడా మా గ్రామంలో పర్యటించలేదు. చనిపోయిన కుటుంబీకులను పరామర్శించాడే తప్ప వరద బాధితులను పరామర్శించలేదు. 


జగనన్న మాటలన్నీ గాలి మూటలే...

- కొండా కుమార్‌, ఎగువ మందపల్లె 

జగనన్న చెప్పే మాటలన్నీ గాలి మూటలే అనే విషయం ఎగువ మందపల్లెలో సీఎం పర్యటనలో తేలిపోయింది. పులపత్తూరు గ్రామంలో వాళ్ల పార్టీ వాళ్లు చెప్పినట్లు రెండున్నర గంటల వరకు అక్కడే ఉండి మా ఊరికొచ్చేటప్పటికీ పది నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లాడంటే ఈయన మాటలు ఏమాత్రం నమ్మాల్నో సులభంగా తెలుకోండి.


మా ఊర్లో ఇంత నష్టం జరిగితే సీఎం పట్టించుకోలేదు

- వై.సుబ్బరామరాజు, అడివిరాచపల్లె 

మా గ్రామంలో సుమారు 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. పంటలు, పశువులు పాడయ్యాయి. మా ఊరి నష్టాల గురించి సీఎం పట్టించుకోలేదు. మా ఊరికి రాకుంటే రాకపోనీ.. కనీసం మాకు జరిగిన నష్టాన్ని గమనించి ఇళ్లు కట్టిస్తే పంటలకు నష్టపరిహారం ఇస్తే చాలు.

సర్వం కోల్పోయిన బాధితురాలికి ఇంటి మంజూరు పత్రాన్ని అందిస్తున్న సీఎం


మందపల్లెలో ప్రజలను బయటకు రానివ్వకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లు


Advertisement
Advertisement